టాలీవుడ్ దర్శకుడు తేజ నుంచి క్రేజీ అప్‌డేట్ వస్తోంది. త్వరలో తన కుమారుడిని హీరోగా పరిచయం చేయనున్నాడు. తేజ సినిమా కావడంతో అప్పుడే ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు దర్శకుడు తేజ గురించి చర్చ నడుస్తోంది. దగ్గుబాటి రాణాతో రాక్షస రాజా సినిమా ప్రకటించి వార్తల్లో నిలిచిన తేజ ఇప్పుడు తన కొడుకుని హీరోగా పరిచయం చేయనుండటం చర్చనీయాంశంగా మారింది. దగ్గుబాటి రాణాతో గతంలో తేజ తీసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా విజయవంతమైంది. దాంతో రాక్షసరాజ సినిమాపై చాలా అంచనాలు వచ్చాయి. కానీ ఆ తరువాత ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. ఇప్పుడు తన కుమారుడు అమితోవ్ తేజను హీరోగా పరిచయం చేస్తూ సినిమాను అనౌన్స్ చేయడం విశేషం. ప్రస్తుతం తేజ కుమారుడు విదేశాల్లో యాక్టింగ్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నాడు.
తేజ ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది లేదా వైవిద్యంగా ఉంటుంది. కుమారుడిని హీరోగా పరిచయం చేస్తున్న తొలి సినిమాలో దివంగత నటుడు ఘట్టమనేని రమేశ్ బాబు కుమార్తె ఘట్టమనేని భారతి ఫిమేల్ లీడ్ కన్పించనుంది. ఫీమేల్ లీడ్ రోల్ ఉండే సినిమాలో కొడుకుని హీరోగా పరిచయం చేయనుండటం తేజకే చెల్లింది. ఈ సినిమాపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది.