టాలీవుడ్ నటుల్లో ప్రముఖంగా చెప్పుకోవల్సిన పేరు జగపతి బాబు. ఫేజ్ 1లో హీరోగా చేసిన జగపతి బాబు ఫేజ్ 2లో విలన్ పాత్రలతో మెప్పిస్తున్నాడు. కొత్తగా బుల్లితెర యాంకర్‌గా అవతారమెత్తిన జగ్గుభాయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీ కోసం.
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది సినిమాలో జగపతి బాబు కీలకపాత్రలో మరోసారి మెప్పించేందుకు సిద్ధమౌతున్నాడు. ఇప్పుడు కొత్తగా బుల్లితెర యాంకర్ అవతారమెత్తాడు. జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోను హోస్ట్ చేస్తున్నాడు. ఆగస్టు 17 నుంచి ఈ షో ప్రసారం కానుంది. సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉండే జగపతి బాబుకు వివాదాలకు దూరంగా ఉంటాడనే పేరుంది. ఇటీవల ఓ యూట్యూబ్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
చచ్చిపోయేవాడినే..ఆ దర్శకుడి కారణంగా
తన సినిమా కెరీర్‌లో తనకు నచ్చిన అత్యంత ఇష్టమైన సీన్ అంతపురం సినిమాలో క్లైమాక్స్ అంటున్నాడు జగపతి బాబు. అదే తన చివరి క్షణం అని కూడా అనుకున్నానన్నాడు. ఎందుకంటే ఆ సినిమా క్లైమాక్స్ సీన్ చేస్తున్నప్పుడు దర్శకుడు కృష్ణవంశీ సీన్‌లో లీనమై కట్ చెప్పడం మర్చిపోయాడు. దాంతో తాను చచ్చి బతికానని చెప్పుకొచ్చాడు. తరచూ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు, ప్రశ్నలకు కూడా జగపతి బాబు స్పందిస్తుంటాడు. వాస్తవానికి తన పూర్తి పేరు జగపతి రావు కాగా ఇండస్ట్రీలో రావులు ఎక్కువయ్యారని బాబు కింద మార్చుకున్నానన్నాడు.
జగపతి బాబు జుట్టుకి రంగు వేసుకోకుండా తెల్ల జుట్టుతోనే దర్శనిస్తుంటారు. నాకు ఈ వయస్సులో జుట్టు ఉండటమే అదృష్టం..అలాంటిది సహజసిద్ధంగా తెల్లబడింది, దాన్నలాగే ఉంచుతాను. సహజంగా ఉంటేనే నేను బాగుంటాను, నన్నిలేగా వదిలేయండంటూ విన్నవించుకున్నాడు. చివరి శ్వాస వరకూ ఆరోగ్యంగా ఉండాలనేదే తన కోరికన్నాడు.