చదువు కొనకూడదు.. చదువుకుందాం అనే సందేశంతో.. తెరకెక్కిన సార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. చదువు విలువను చర్చించే ఈ సినిమాను మరింత మందికి చేరువ చేయడం కోసం చిత్ర యూనిట్ ఓ మంచి పని చేసింది. ఆ వివరాలు..
10-15 ఏళ్ల క్రితం వరకు.. విజ్ఞన, సందేశాత్మక చిత్రాలు వస్తే.. కొన్ని ప్రత్యేక షోలు వేసి.. స్కూల్ పిల్లలకు ఫ్రీగా ఆ సినిమా చూపించేవారు. ఎందుకంటే మాట కన్నా దృశ్యం మెదడులో బలంగా నాటుకుపోతుంది కనుక.. విజ్ఞానపరమైన సినిమాలు వస్తే.. వాటిని పిల్లలకు చూపడం వల్ల వారికి కొత్త విషయం పరిచయం చేసినట్లు అవుతుందని భావించేవారు. అయితే ప్రస్తుత కాలంలో వస్తోన్న సినిమాలు చూస్తే.. ఈ లక్షణాలు మచ్చుకు ఒక్కటి అంటే ఒక్కటి కూడా కనిపించవు. సినిమా మొత్తం బీభత్సమైన ఫైట్లు, డబుల్ మీనింగ్ కామెడీ, వెగటు సీన్లు. ఈ మధ్య కాలంలో వచ్చే చాలా సినిమాలు కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగానే ఉండటం లేవు. ఇక పిల్లలకు ఏం చూపిస్తాం. అయితే ఏడాది మొత్తం మీద కొన్ని మంచి సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ ఏడాది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే సందేశాత్మక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సార్ చిత్రం. విద్యా వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కింది ఈ చిత్రం. ఈ క్రమంలో తాజాగా విద్యార్థుల కోసం చిత్ర యూనిట్ ఓ నిర్ణయం తీసుకుంది. అంది ఏంటంటే..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మేనన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సార్’. ‘చదువుకుందాం.. చదువు’కొన’కూడదు’ అంటూ విద్యకు ఉన్న ప్రాధాన్యతను ఈ సినిమాలో ఎంతో చక్కగా.. మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు దర్శకుడు వెంకీ అట్లూరి. అలాగే కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమాలు ఎలా సాగుతాయో కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించారు. చిన్నలు మొదలు పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమాతో ఏదో ఓ పాయింట్‌లో కనెక్ట్ అవుతారు. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసింది. సినిమా క్లాస్ అయినప్పటికి మాస్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన సార్ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్‌కు తెలుగులో మొదటి డైరెక్ట్ సినిమా ఇంది. ఇక సినిమా విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సార్ సినిమాకు ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావడం విశేషం. అటు తమిళ్‌లో కూడా సినిమా మంచి కలెక్షను సాధించింది. కాగా చదువు విలువను చర్చిస్తూనే మంచి మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌కు చోటివ్వడంతో సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వస్తోంది. చదువుకునే వాళ్లు, చదువు చెప్పేవాళ్లు అందరూ ఈ సినిమా కచ్చితంగా చూడాలని కామెంట్లు వస్తున్నాయి.
ఈక్రమంలో ‘సార్’ సినిమా యూనిట్, ప్రముఖ మల్టిప్లెక్స్ సంస్థ పీవీఆర్‌తో కలిసి ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. సినిమా మరికొందరికి రీచ్ అయ్యేలా హైదరాబాద్ లోని పలు గవర్నమెంట్ పాఠశాలలోని దాదాపు 500 మంది విద్యార్థులకు సార్ సినిమాని పీవీఆర్ థియేటర్స్‌లో ఉచితంగా చూపించారు చిత్ర యూనిట్. అంతే కాకుండా విద్యార్థులకు ఫ్రీగా పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, బెలూన్స్ కూడా అందించారు చిత్రయూనిట్. అలాగే సినిమా పూర్తయిన తర్వాత మూవీ ఎలా ఉంది అని విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులంతా ‘సార్’ సినిమా చాలా బాగుందంటూ కామెంట్స్ చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులు వచ్చి సినిమా చూడటం, హాల్‌లో సందడి చేయడం వంటి దృశ్యాలను చిత్రీకరించి పీవీఆర్ సంస్థ, చిత్రయూనిట్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సార్ చిత్ర ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.