దర్శక ధీరుడు రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ చెర్రీ ఏమన్నారంటే..!
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీమ్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. తాజాగా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ గురించి కూడా ఆయన ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రపంచ సినిమాకు సంబంధించి తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీ గురించి చెర్రీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మార్వెల్ మూవీస్‌కు దర్శకత్వం వహిస్తే చూడాలని ఉందన్నారు చెర్రీ. అదే జరిగితే అప్పుడు అందరికీ పార్టీ ఇస్తానన్నారు.
‘రాజమౌళి మార్వెల్ మూవీస్‌కు డైరెక్షన్ వహించాలని ఆశిస్తున్నా. అదే జరిగితే.. అందరికీ పార్టీ ఇస్తా. నేను వాళ్ల ప్రతి సినిమాలోనూ ఉండాలని అనుకుంటా. ప్రస్తుతం చిత్రరంగానికి ఎలాంటి హద్దులూ లేవు. హాలీవుడ్, బాలీవుడ్ అనే భేదాల్లేవు. అలాంటి ఓ రంగంలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా’ అని చరణ్ వ్యాఖ్యానించారు. తండ్రి చిరంజీవి గురించి చెర్రీ చెబుతూ.. ఆయన తన సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారన్నారు. ‘80వ దశకంలో ఓసారి ఆస్కార్ వేడుకకు నాన్న హాజరయ్యారు. అదే భారీ విక్టరీగా భావించారు. ‘నాటు నాటు’ ఆస్కార్‌కు నామినేట్ అయిందని తెలిసి ఎంతో ఆనందించారు. ఆస్కార్ కోసం కోట్లాది భారతీయులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ అవార్డు మాకు ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ లాంటిది’ అని చరణ్ పేర్కొన్నారు.
Gearing up for Sunday 🌟.
Had a gud chat with @AshCrossan at @etnow pic.twitter.com/uCruMDcyzQ— Ram Charan (@AlwaysRamCharan) March 10, 2023