సినిమా హీరోలు, నటులు, దర్శకులు రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటారు. ఎక్కడో ఒకరిద్దరు తప్పితే.. రాజకీయాల్లో సంబంధం లేకపోతే అస్సలు నోరు విప్పరు. మనకెందుకొచ్చిన గొడవ అని రాజకీయ నేతలను విమర్శించే ధైర్యం చేయరు. కానీ ఆర్. నారాయణమూర్తి మాత్రం అందుకు భిన్నం. ఎవరేమనుకున్నా గానీ తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్తారు, కానీ సున్నితంగా చెప్తారు. రాజకీయ విమర్శలు చేసినప్పటికీ అందులో సున్నితత్వం ఉంటుంది. రిక్వస్ట్ చేస్తారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు ఆర్ నారాయణమూర్తి. విప్లవ నేపథ్యం ఉన్న సినిమాలను తెరకెక్కించడం ద్వారా పీపుల్ స్టార్ గా పేరొందిన ఆర్. నారాయణమూర్తి.. బయట కూడా ప్రజల మనిషిగానే ఉంటారు. ప్రజల గురించే ఆలోచిస్తారు.
రాజకీయ నాయకులు మంచి చేస్తే మెచ్చుకుంటారు. తప్పు చేస్తే తప్పుబడతారు. ఏదైనా గానీ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. మనసులో ఒకటి ఉంచుకుని.. బయటకు ఒకటి మాట్లాడే రకం కాదు. మొహమాటం లేకుండా మాట్లాడతారు. ఏదైనా లోపాలు ఉంటే ఎత్తి చూపుతారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీని ప్రశ్నించారు. గత ఎన్నికల సందర్భంగా.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేశ ప్రజలకు ఇచ్చిన మాటను మోదీ నిలిబెట్టుకోవాలని అన్నారు. సేవా రంగంలో విద్య, వైద్య రంగాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని.. దీనిపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం సరికాదని అన్నారు.
ఆర్. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘యూనివర్సిటీ’ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీశానని నారాయణమూర్తి అన్నారు. విద్య, వైద్యం వంటి సేవా రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలని రాజ్యాంగం చెబుతుందని, కానీ ఈ రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ గారు.. ఏవి ఆ ఉద్యోగాలు? దయుంచి ఉద్యోగాలు ఇవ్వండి సార్’ అంటూ విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై ఈ చిత్రంలో విజ్ఞప్తి చేశానని అన్నారు. మరి ఆర్. నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.