జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓవైపు సినిమాలు చేస్తూనే, తన సమయాన్ని రాజకీయాలలో కూడా వెచ్చిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన పవన్.. ఈసారి భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు. హరిహర వీరమల్లు, వినోదయ సితం రీమేక్ లతో పాటు డైరెక్టర్ సుజిత్ తో ‘ఓజి’ మూవీ, హరీష్ శంకర్ తో మరో సినిమా లైనప్ చేసి ఫ్యాన్స్ కి కిక్కిచ్చాడు. అయితే.. సినిమాలకు ఎంత టైమ్ కేటాయిస్తున్నాడో.. దానికి ఎక్కువ సమయాన్ని రాజకీయాలకు కేటాయిస్తున్నాడు. దాదాపు పదేళ్లుగా ఏపీ రాజకీయాలలో తనవంతు కృషి చేయాలని అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
2024 ఎన్నికల కోసం సర్వత్రా సిద్ధం అవుతూ.. తన సేనని ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సభను కూడా నిర్వహించాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సినిమాల రెమ్యూనరేషన్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా యూత్ ని ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ.. ‘మీరు అధికారం ఇస్తే సేవకుడిలా చేస్తాను.. అధికారం ఇవ్వకపోతే నిలబడే ఉంటాను. ఎక్కడికిపోను. పదేళ్లు చూశారు నన్ను. ఈరోజుకి నేను చేస్తే.. ఏడాదికి రూ. 250 కోట్లు సంపాదించగలను. నేను సంపూర్ణంగా సినిమాలు చేస్తే.. ఒకరోజు నాది కాదు అనుకుంటే కోటి రూపాయలు పోతుంది’ అని చెప్పాడు.
అనంతరం ఇంకా మాట్లాడుతూ.. “నాకున్న సమర్థతకి, ప్రతిభకి రోజుకు యావరేజ్ గా కోటి రూపాయలు సంపాదించగలను. కానీ.. నా కోటిని వదులుకొని.. నా కోటిమంది ప్రజల కోసం, అన్నదమ్ముల కోసం వస్తున్నా. నా కోటికంటే కూడా మీ కోట్లాది జీవితాలు ముఖ్యం. నేను అడ్డ దారులు తొక్కను. పార్టీ నడపడానికి విరాళాలు కావాలి.. దోచేయడానికి కాదు. లెక్కలతో చెప్తాను. నేను మిమ్మల్ని దగా చేయను. బాధ్యతగా ఉంటా.. కులాలకు కొమ్ము కాయను” అంటూ పవన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో, వార్తలలో చర్చనీయాంశంగా మారాయి. మరి పవన్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.