ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అరవింద సమేత'.. బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మరో ప్రాజెక్టు అనౌన్స్ చేశారు కానీ అది లేటవుతోంది. ఇప్పుడు ఆ మూవీ గురించి అదిరిపోయే న్యూస్ బయటకొచ్చింది.
త్రివిక్రమ్.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. రైటర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి, మాటల మాంత్రికుడుగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సృష్టించుకున్నాడు. దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వకముందే ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘స్వయం వరం’ , ‘చిరుజల్లు’ లాంటి సినిమాలకు కథ, మాటలు అందించి అందర్నీ మెప్పించాడు. ఒక రచయిత డైరెక్టర్ కాకుండా తన మాటలతోనే ఆకట్టుకోవడం అప్పట్లో త్రివిక్రమ్ కే సాధ్యమైంది. అంత గొప్పగా ఉంటుంది త్రివిక్రమ్ రైటింగ్ స్టైల్. ఇండస్ట్రీకి వచ్చిన చాలా ఏళ్ల తర్వాత.. 2002లో “నువ్వే నువ్వే” సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఆ తర్వాత మహేష్, అల్లు అర్జున్ లాంటి స్టార్లతో సినిమాలు చేసి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో కొన్ని బ్లాక్ బస్టర్ లుగా ఉండగా, ‘అత్తారింటికి దారేది’ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ప్రస్తతం సూపర్ స్టార్ మహేష్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత తారక్ తో చేయబోయే మూవీ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ తో త్రివిక్రమ్ రేంజ్ చాలా వరకు పడిపోయింది. దీనితో త్రివిక్రమ్ కి ఆ టైం లో ఒక హిట్ కావాలి. ఇలాంటి తరుణంలో త్రివిక్రమ్ తొలి సారి తారక్ తో చేతులు కలిపాడు. వీరిద్దరి కలయికలో వచ్చిన అరవింద సమేత సినిమా క్లీన్ హిట్ గా నిలిచింది. దీనితో త్రివిక్రమ్ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని చాటుకున్నాడు. త్రివిక్రమ్ శైలికి ఈ సినిమా కొంచెం భిన్నంగా అనిపించినప్పటికీ.. “త్రివిక్రమ్ ఒక మాస్ మూవీ తీస్తే ఇలా కూడా ఉంటుంది” అని ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత వీళ్ల కాంబోలో మరో మూవీ కూడా అనౌన్స్ చేశాడు. అది కాస్త లేటవుతూ వస్తోంది. ఇప్పుడీ సినిమాపై సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఇది పౌరాణికం నేపథ్యంలో ఉంటుందని అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ నెలలోనే పూజ కార్యక్రమాలు మొదలుపెట్టి ఈ చిత్రాన్ని, వచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అయ్యే ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండూ పూర్తయిన తర్వాతే తారక్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది. పాత్ర ఎలాంటిదైనా అందులో పరకాయ ప్రవేశం చేసే ఎన్టీఆర్ కి పౌరాణికం అంటే వెన్నతో పెట్టిన విద్య. ఈ కారణంగానే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ పై అప్పుడే బజ్ స్టార్ట్ అయింది. మరి వీరిద్దరి కలయికలో రాబోతున్న మూవీ ఎలా ఉంటుందో, ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.