తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. ప్రముఖ హీరో, బీజేపీ నేత కృష్ణం రాజు ఇటీవల అనారోగ్య సమస్యతో కన్నుమూశారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారే శోక సంద్రంలో మునిగిపోయింది. ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణం రాజు సోదరుడి తనయుడు ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పార్ ఇండియా స్టార్ గా ఎదిగారు.
ఇటీవల కృష్ణం రాజు కుటుంబాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి పరామర్శిస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధర దేవి, కృష్ణం రాజు ఇంటికి వెళ్లి ఆయన సతీమణి శ్యామలదేవిని పరామర్శించారు. మొదట ఆయన ఫోటోకి నివాళులర్పించారు బాలకృష్ణ దంపతులు. తర్వాత కృష్ణం రాజు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కొద్ది సేపు కృష్ణం రాజు సతీమణి శ్యామలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం ఇండస్ట్రీకి తీరని లోటు అని అన్నారు. ఆయన సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారని.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.