టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి కొన్ని రోజుల క్రితం ఎన్నో వార్తలు వచ్చాయి. భూమా శోభానాగిరెడ్డి.. కుమార్తె మౌనికను రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఓ కార్యక్రమంలో జంటగా సందడి చేశారు. దాంతో.. త్వరలోనే వీరి వివాహం జరగబోతుందంటూ వార్తలు వచ్చాయి. ఇక మనోజ్ కూడా భార్య నుంచి విడాకులు తీసుకోగా.. మౌనిక కూడా భర్త నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మనోజ్ వ్యాఖ్యలు చూస్తే.. త్వరలోనే వారి వివాహం జరగబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చినట్లు అర్థం అవుతోంది అంటున్నారు నెటిజనులు. ఆ వివరాలు..
ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే, దివంగత భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆమె పిల్లలు.. భూమా ఘాట్‌లో ఆమెకు నివాళులు అర్పించారు. అలానే పెద్ద కుమార్తె మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కుమారుడు వీర నాగిరెడ్డి మొదటి పుట్టినరోజు వేడుకలను.. భూమా అభిమానుల మధ్య అక్కడే జరుపుకున్నారు. అలాగే భూమా నాగ మౌనికతో కలిసి సినీ నటుడు మంచు మనోజ్ కూడా శోభానాగిరెడ్డికి నివాళులర్పించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో శోభ నాగిరెడ్డి సమాధి వద్ద ఇద్దరు కలిసి నివాళులర్పించారు. వీరిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.
అనంతరం మంచు మనోజ్ శుక్రవారం కడప దర్గాను కూడాసందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత, సినిమా జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు మనోజ్. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చాలా కాలం నుంచి కడప దర్గాను దర్శించుకోవాలని అనుకుంటున్నా. కడప దర్గాను దర్శించుకుంటే.. మంచి జరుగుతుందని.. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పారు. కానీ ఇక్కడకు రావడానికి ఎందుకో చాలా సమయం పట్టింది. ఇన్నాళ్లకు.. ఇప్పుడు ఆ అల్లానే నన్ను ఇక్కడకు రప్పించారు. దర్గాకు రావడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంది. తర్వలోనే కొత్త సినిమా ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నాను. అలానే కొత్త జీవితంలోకి కూడా అడుగుపెడుతున్నా. మళ్లీ కుటుంబంతో కలసి దర్గాకు వస్తాను’’ అని చెప్పుకొచ్చారు మనోజ్. ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇక దర్గాలో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాను అన్నాడు.. అంటే.. త్వరలోనే మనోజ్.. రెండో వివాహం చేసుకోబోతున్నాడా.. అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సికింద్రాబాద్ గణేష్ మండపానికి మనోజ్-మౌనిక కలిసి జంటగా వెళ్లి.. దేవుడిని దర్శనం చేసుకున్నారు. అప్పుడే వీరి పెళ్లిపై వార్తలు వచ్చాయి. రాజకీయ ప్రవేశం, మౌనిక పెళ్ళిపై తానే సమయం వచ్చినపుడు చెబుతానని మనోజ్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మనోజ్ చేసిన వ్యాఖ్యలు వాటికి బలం చేకూరుస్తున్నాయి. మనోజ్ పెళ్లిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అనుకుంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.