సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల వరుస మరణాలు అభిమానులను కలచివేస్తున్నాయి. ఒకరి మరణం గురించి మర్చిపోయేలోపే మరొకరు వార్తల్లో నిలవడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి.. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ ఇటీవల కన్నుమూశారు.
తెలుగు సినిమా పాటలతో పాటు తెలంగాణకు సంబంధించి ఎన్నో మరుపురాని పాటలు రాశారు రచయిత కందికొండ యాదగిరి. ఇండస్ట్రీలో కందికొండగా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా కాలంగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతుండటం, చికిత్సకు భారీగా ఖర్చవుతుండటంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. గొంతు క్యాన్సర్ తో బాధపడుతోన్న కందికొండ ఆరోగ్యం విషమించడంతో పలుమార్లు ఆస్పత్రిలో చేరారు. ఆయా సందర్భాల్లో మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని ఆయనకు మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో కందికొండకు మంచి పేరుంది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో మళ్లి కూయవే గువ్వ పాటతో కందికొండ గేయ రచయితగా మారారు. ఆ తర్వాత ‘ఇడియట్’ లో చూపుల్తో గుచ్చి గుచ్చి, ‘సత్యం’లో మధురమే మధురమే, ఐయామ్ ఇన్ లవ్.. ‘పోకిరి’ లో గలగల పారుతున్న గోదారిలా, జగడమే.. ‘లవ్ లీ’ లో లవ్‌లీ లవ్‌లీ లాంటి తదితర పాపులర్ పాటలు రాశారు.
చివరిగా 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు. తెలంగాణ పండుగలైన బోనాలు, బతుకమ్మతోపాటు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే పలు పాటలను కందికొండ రాశారు. ప్రస్తుతం కందికొండ మృతి పట్ల సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరి కందికొండ పాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.<