టాలీవుడ్ లో మరో విషాదం అభిమానులను క్షోభకు గురిచేసింది. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ హఠాన్మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నృత్య కళాకారులు రాకేష్ మాస్టర్ మరణంతో దుఖంలో మునిగిపోయారు.
తెలుగు ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.. దాదాపు 1500 సినిమాలకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా చేసిన రాకేష్ మాస్టర్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. వినూత్నమైన స్టెప్పులతో డ్యాన్స్ అదరగొట్టిన రాకేష్ మాస్టర్ పలువురు డ్యాన్సర్లకు గురువుగా మారారు. ఇండస్ట్రీలో ఇప్పుడు రాణిస్తున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లు రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసిన వారే.అంతేకాకుండా నటుడు వేణు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు కూడా డ్యాన్స్ లో మెళకువలు నేర్పిన సందర్భాలు ఉన్నట్టుగా కొన్ని ఫొటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఇంతటి పేరు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ తన కెరీర్ లో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. సినిమాల్లో అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో అత్యంత దయనీయమైన స్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో మధ్యానికి బానిసై కుటుంబాన్ని దూరం చేసుకుని ఒంటరిగా జీవిస్తున్నారు. కాగా సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్య్వూలు ఇస్తూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండేవారు. సోషల్ మీడియా ద్వారా పలువురు కొరియోగ్రాఫర్లపై నిర్మొహమాటంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచేవారు.
అప్పట్లో అంతటి ఆధరణ పొందిన రాకేష్ మాస్టర్ ఆ తరువాత అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు. ఇదిలా ఉండగా కొంతకాలంగా రాకేష్ మాస్టర్ ఓ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని కొంత మంది టీమ్ గా ఏర్పడి మంచి మంచి కాన్సెప్ట్ లతో వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. అయితే ఆ వీడియోలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్లుగా తెలిసింది. దీంతో ఆ ఛానల్ కు దాదాపు నాలుగున్నర లక్షల మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నట్లుగా సమాచారం. దీంతో ఆయన వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చి మంచి ఆదాయం అందుకునే వారని పలువురు అంటున్నారు. రానున్న కొద్ది కాలంలోనే రాకేష్ మాస్టర్ పూర్వవైభవాన్ని పొందేవారని సన్నిహితులు చెప్తున్నట్లుగా తెలిసింది. కానీ ఇంతలోనే రాకేష్ మాస్టర్ అస్వస్థతకు గురై ఆకస్మికంగా మృతిచెందడం చాలా బాధకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.