సినిమా ఇండస్ట్రీలో దాదాపు ప్రతి ఒక్కరి చుట్టూ ఏదో ఒక గాసిప్ లేదా బంధం నడుస్తూ ఉంటుంది. కొందరు బహిరంగమైతే మరి కొందరు గుట్టుచప్పుడు కానివ్వరు. ఈ హీరో మాత్రం జీవితంలో తానే సర్వస్వం అంటున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళ స్టార్ హీరో జయం రవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమానే ఇంటిపేరుగా మల్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో జయం రవి తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. దీనికి కారణం మరో మహిళతో ప్రేమాయణం నడుపుతుండటమే. 2009లో ఆర్తిని పెళ్లి చేసుకున్న జయం రవి 15 ఏళ్ల వైవాహిక జీవితానికి బ్రేక్ చెబుతున్నాడు. ఈ ఇద్దరూ విడాకులు తీసుకోవాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. మరోవైపు సింగర్ కెనీషాతో రిలేషన్ నడుపుతూ వార్తల్లో నిలుస్తున్నాడు.
ఎక్కడికెళ్లినా ఆమెతోనే ప్రత్యక్షమౌతుండటంతో ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు బలంగా విన్పిస్తున్నాయి. ఇటీవల ప్రారంభమైన అతని సొంత బ్యానర్ రవిమోహన్ స్డూడియోస్ ప్రారంభోత్సవానికి సైతం కెనీషాతో కలిసి వచ్చాడు. ఈ స్టూడియోలో కెనీషా పార్టనర్ అని కూడా ప్రకటించాడు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమౌతున్నాయి. భార్యని వదిలేసి ప్రేయసి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించేవారు లేకపోలేదు.
కెనీషా నాకు దేవుడు పంపిన వరం
రవి మోహన్ ఇంతటితో ఆగలేదు. బహిరంగంగానే తనకు కెనీషాకు మధ్య ఏముందో చెప్పకనే చెప్పాడు. జీవితంలో ఇంత వరకూ తనలా ఎవరూ సహాయం చేయలేదంటున్నాడు. తానేంటో తనకు తెలిసేలా చేసింది తనేనంటున్నాడు. జీవితంలో ఒక్కోసారి ఏం చేయాలో తెలియని స్ఠితిలో ఉన్నప్పుడు ఆ దేవుడు ఏదో రకంగా సహాయం చేస్తుంటాడని..అలా భగవంతుడు పంపిన బహుమతి అని కెనీషా గురించి చెబుతూ ఆవేదనకు లోనయ్యాడు. ఆ సమయంలో కెనీషా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ఈ ఇద్దరి మధ్య ప్రేమకు ఇదే నిదర్శనమంటున్నారు నెటిజన్లు.
తనను ప్రేమగా చూసింది, దీవించింది ముగ్గురు మహిళలని చెప్పిన జయం రవి…ఆ ముగ్గురిలో తన భార్య ఆర్తికి స్థానం ఇవ్వకపోవడం గమనార్హం. ఆ ముగ్గురు మహిళల్లో..తన తల్లి, ప్రేయసి కెనీషా, ఫ్రెండ్ జెన్నీ ఉన్నారన్నాడు. 15 ఏళ్ల దాంపత్య జీవితం ఏమైపోయిందని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.