కోలీవుడ్ ప్రముఖ కమెడియన్‌ను కోల్పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమిళ హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూశారు. రోబో శంకర్ మృతి పట్ల చిత్ర ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్న రోబో శంకర్ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈయన వయసు 46 ఏళ్లు. మూడ్రోజుల క్రితం ఒక్కసారిగా అస్వస్థతకు గురై మూర్ఛపోవడంతో వెంటనే చెన్నైలోని ఓఎంఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల కథనం ప్రకారం రోబో శంకర్‌ను అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆసుపత్రికి తీసుకొచ్చారు. తీవ్రమైన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్, కాంప్లెక్స్ అబ్డామినల్ కండీషన్ వల్ల అవయవాలు సక్రమంగా పనిచేయలేదు. వైద్య బృందం అన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
రోబో శంకర్ నిన్న రాత్రి 8.30 గంటల సమయంలో కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అజిత్ హీరోగా వచ్చిన విశ్వాసం, విజయ్ నటించిన పులి, సూర్య సింగం 3, విక్రమ్ సినిమా కోబ్రా ఇలా చాలా చిత్రాల్లో తనదైన శైలితో హాస్యం పండించారు. బుల్లి తెర నుంచి వెండితెరకు వచ్చిన రోబో శంకర్ కామెడీ మంచి టైమింగ్‌తో ఉంటుంది. అధికంగా మద్యం సేవించే అలవాటు కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. రోబో శంకర్ మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. రోబో శంకర్ ఆకశ్మిక మరణం తమిళ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా చెబుతున్నారు.