చిత్ర పరిశ్రమలో ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు అభిమానులకు పండగే. ఇక ఆ పెద్ద సినిమా మెగాస్టార్ ది అయితే.. అది కూడా పండగ రోజు అయితే.. ఇక చెప్పక్కర్లేదు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో. డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ గా.. అభిమానుల ముందుకు దసరా కానుకగా సెప్టెంబర్ 5 న థియేటర్లలో సందడి చేయనున్నాడు మెగాస్టార్. ఈ నేపథ్యంలో డైరెక్టర్ తాజాగా చిత్రానికి సంబంధించిన విశేషాలను విలేకర్లతో పంచుకున్నాడు. గాడ్ ఫాదర్ లో 10 సర్ ప్రైజ్ లు ఉంటాయని, మెగాస్టార్ ను ఓ కొత్త కోణంలో చూస్తారని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
”హనుమాన్ జంక్షన్” తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు ఈ సినిమా గురించి తెలియనివారు ఉండరనే చెప్పాలి. ఈ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు డైరెక్టర్ మోహన్ రాజా. అయితే ఈ చిత్రం తర్వాత పూర్తిగా ఆయన తమిళ చిత్ర రంగానికే పరిమితం అయ్యారు. తెలుగు చిత్రాలను అక్కడి పరిశ్రమలో రీమేక్ చేస్తూ.. మంచి పేరు తెచ్చుకున్నారు. మళ్లీ 21 సంవత్సరాల తర్వాత గాడ్ ఫాదర్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్దం అయ్యారు. మలయాళం మూవీ అయిన ‘లూసీఫర్’ ని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నాడు మోహన్ రాజా. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. బుధవారం విడుదలవుతోన్న ఈ చిత్రం గురించి డైరెక్టర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..”మీరు గాడ్ ఫాదర్ లో పది సర్ ప్రైజ్ లు చూస్తారు. స్క్రీన్ ప్లే, పాత్రలు, చిరంజీవి క్యారెక్టర్ లాంటి వన్నీ మీకు సర్ ప్రైజింగ్ గా అనిపిస్తాయి. ఇక ఇద్దరు పెద్ద హీరోలు మెగాస్టార్, సల్మాన్ లను డైరెక్ట్ చేయడం సాహసంతో కూడుకున్నది. కానీ నాకు షూటింగ్ టైమ్ లో ఒత్తిడి లేకుండా చిరు ఎంతో ప్రోత్సహించాడు. ఇక సల్మాన్ సెట్ లో చాలా ప్రశాంతంగా ఉంటాడని, ఆయన్ని సెట్లో చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది అని మోహన్ రాజా అన్నారు. మెగాస్టార్ పై ఉన్న ప్రేమతోనే సల్మాన్ ఈ చిత్రం చేశాడని తెలిపాడు. లూసీఫర్ మూవీలోని బలాలు, బలహీనతలు నాకే ఎక్కువ తెలుసని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
ఈ సినిమా అవకాశం ఎలా వచ్చిందో మరిన్ని వివరాలను పంచుకుంటూ.. “ఈ చిత్ర అవకాశం రామ్ చరణ్ ద్వారానే వచ్చింది. ధృవ సినిమా నుంచే చరణ్ నాకు పరిచయం. ధృవ-2 కథా చర్చలు జరుగుతున్న సమయంలో ‘లూసీఫర్’ మూవీ ప్రస్తావన వచ్చింది. దాన్ని రీమేక్ చేస్తే బాగుంటుంది అని భావించారు. దాంతో నిర్మాత ఎన్వీ ప్రసాద్.. చరణ్ కు, చిరుకు డైరెక్టర్ గా నా పేరును సూచించారు. దాంతో ఆయన నాకు కాల్ చేయడంతో వచ్చి మెగాస్టార్ ను కలిశాను. ఇక్కడ మరో విశేషం ఏంటంటే? నేను వారిని కలిసే ముందు రోజే లూసీఫర్ మూవీ చూశా. ఆ సినిమా లో నాకో కొత్త కోణం కనిపించింది. అదే వెళ్లి చిరంజీవి గారికి చెప్పా.. ఆయనకు నచ్చడంతో సినిమా మెుదలెట్టాం. అదీ కాక గాడ్ ఫాదర్ కు సీక్వెల్ చేసే అవకాశం కూడా ఉందని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే తన మనసులో ఉన్న మాటను కూడా ఆయన బయటపెట్టారు. ధృవ-2 చేయలన్న ఆలోచన తనకు ఉన్నట్లు పేర్కొన్నాడు. నాగ్-అఖిల్ తో భారీ స్టైలిష్ యాక్షన్ మూవీ చేయబోతున్నట్లు తెలిపాడు.