టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవిని తొలిసారి డైరెక్ట్ చేసిన ప్రముఖ దర్శకుడు మృతి చెందారు.
టాలీవుడ్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగులో వందలాది చిత్రాల్లో నటించిన సీనియర్ నటుడు శరత్ బాబు ఈ సోమవారం మరణించిన సంగతి తెలిసిందే. శరత్ బాబు మృతితో ఆయన అభిమానులతో పాటు టాలీవుడ్ ఆడియెన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. శరత్ బాబు మరణానికి ముందురోజే ప్రముఖ సంగీత దర్శకద్వయం రాజ్-కోటిలో ఒకరైన రాజ్ హార్ట్ ఎటాక్‌తో పరమపదించారు. అనంతరం పాన్ వరల్డ్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’లో విలన్‌గా తనదైన విలక్షణ నటనతో అందర్నీ ఆకట్టుకున్న రే స్టీవెన్సన్ కన్నుమూశారు. ఒక వారం వ్యవధిలో ముగ్గురు ప్రముఖుల మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీన్ని మరువక ముందే ఇప్పుడు మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కే వాసు చనిపోయారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కే వాసు.. కిమ్స్‌లో ట్రీట్మెంట్ పొందుతూ కొద్దిసేపటి కింద తుదిశ్వాస విడిచారు.
మెగాస్టార్ చిరంజీవి తెరపై తొలిసారి కనిపించిన ‘ప్రాణం ఖరీదు’ను తెరకెక్కించింది కె.వాసునే కావడం గమనార్హం. ఈ మూవీని దివంగత దర్శకుడు క్రాంతి కుమార్ నిర్మించారు. ‘ప్రాణం ఖరీదు’ డైరెక్టర్‌గా వాసుకు మంచి పేరును తెచ్చింది. ఈ సినిమా తర్వాత పలు భక్తిరస చిత్రాలతో తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నారు వాసు. విజయ్ చందర్ షిరిడీ సాయిబాగా పాత్రలో నటించిన ‘శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం’తో పాటు ‘అయ్యప్ప స్వామి మహత్యం’ మూవీతో తన ఖ్యాతిని రెట్టింపు చేసుకున్నారు కే వాసు. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి కలయికలో ‘తోడు దొంగలు’, చంద్రమోహన్‌తో ‘అల్లుళ్లొస్తున్నారు’ సినిమాలను తీశారాయన. వీటితో పాటు ‘గోపాల్ రావు గారి అమ్మాయి’, ‘పక్కింటి అమ్మాయి’, ‘గువ్వల జంట’ లాంటి సినిమాలను తీశారు. ఇన్ని హిట్ సినిమాలతో ఆడియెన్స్‌ను అలరించిన కే వాసు మృతికి పలువురు మూవీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.