భారీ అంచనాలతో విడుదలైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కూలీ అంచనాలకు తగ్గట్టే కలెక్షన్లు రాబడుతోంది. తొలి రోజే బ్రేకింగ్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ నటించిన కూలీ సినిమా అంచనాలకు తగ్గట్టే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. రివ్యూస్ కూడా ఆశించిన స్థాయిలో ఉండటంతో అటు ఉత్తరాది, ఇటు దక్షిణాదిలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 151 కోట్లు వసలు చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. కోలీవుడ్ చరిత్రలో మొదటి రోజు 151 కోట్లు రావడం ఇదే మొదటి సారి. ఇంతకు ముందు ఈ రికార్డు విజయ్ సినిమా లియో పేరిట ఉండేది. లియో మొదటి రోజు కలెక్షన్లు 148 కోట్లు. తమిళంలో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్. లియో సినిమా కూడా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించడం విశేషం.
కేవలం తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా కూలీ భారీ వసూళ్లు రాబడుతోంది. తెలుగులో మొదటి రోజు 20 కోట్లు వసూలు చేయగా హిందీలో 9 కోట్లు, మలయాళంలో 8 కోట్లు, కన్నడలో 8 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లయితే చెప్పనక్కరలేదు. నార్త్ అమెరికాలో మొదటి రోజు 8.76 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. గతంలో బాహుబలి 2 ఓవర్సీస్ కలెక్షన్లు 11.25 మిలియన్ డాలర్లు ఉంది. రెండో రోజు కూడా కూలీ సినిమా భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. అయితే తెలుగులో వార్ 2 సినిమాతో గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఇక సినిమా మూడో రోజు, నాలుగో రోజు శని, ఆదివారాలు కావడంతో కలెక్షన్లు జోరందుకుంటాయని అంచనా వేస్తున్నారు.
కూలీ సినిమాను సన్‌పిక్సర్స్ నిర్మించగా, అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో నాగార్జున నెగెటివ్ రోల్‌లో కన్పిస్తే అమీర్ ఖాన్ ప్రత్యేక కేమియో పాత్ర పోషించనున్నాడు. రజనీకాంత్, నాగార్జునతో పాటు ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక మొదటి రెండ్రోజుల కలెక్షన్లు 200 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. అటు వార్ 2 రెండో రోజు 100 కోట్ల క్లబ్‌లో చేరింది.