కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ పేరు చెప్పగానే తెలుగింటి అమ్మాయి గుర్తొస్తుంది. హోమ్లీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అనుపమ టిల్లు స్క్వేర్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
కేరళ నాజూకు భామ అందాల కుట్టి అనుపమ పరమేశ్వరన్ చీర కడితే పదహారణాల తెలుగమ్మాయిలా ఉంటుంది. అంతకు మించిన అభినయంతో అందర్నీ ఆకట్టుకుంటోంది. చాలా సినిమాల్లో హోమ్లీ హీరోయిన్ పాత్రలు చేసిన ఆమె టిల్లు స్క్వేర్ సినిమాలో మాత్రం విభిన్నంగా కన్పించి ఆశ్చర్యపర్చింది. తాను కూడా ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి ఈ సినిమా హిట్ అయి ఆమెకు పేరు తెచ్చినా తనకు నచ్చని పాత్రని..పూర్తిగా అయిష్టంతో చేశానని చెప్పుకొచ్చింది.
టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ షార్ట్ స్కర్ట్స్, లిప్ కిస్ వంటి సన్నివేశాల్లో కన్పిస్తుంది. ఇదే అభిమానుల్లో చర్చకు దారి తీసింది. ఆమె కూడా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో సంచలన అంశాలు వెల్లడించింది. ఆ సినిమాను తాను పూర్తిగా అయిష్టంగా, అసౌకర్యంగా చేశానని చెప్పడం విశేషం. ఆ సినిమాలో ఆ పాత్ర చేయాలా వద్దా అని చాలా రోజులు ఆలోచించానని తెలిపింది. తన ఫ్యాన్స్‌కు నచ్చిందా లేదా అని కాదని..తనకే నచ్చలేదని వెల్లడించింది. సెట్స్‌పైకి వెళ్లినా 100 శాతం ఇష్టంతో చేయలేదని పేర్కొంది. సినిమాలో లేదా ప్రమోషన్లలో అలాంటి పొట్టి డ్రస్సులు వేసుకోవడం అసౌకర్యంగా అన్పించిందని తెలిపింది.
అయితే సినిమా విడుదలైన తరువాత పాత్రకు పేరొచ్చిందని అనుపమ పరమేశ్వరన్ వివరించింది. కొన్ని పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు విమర్శలు కూడా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని తెలిపింది. ఎలాంటి విమర్శలు వస్తాయని ఊహించానో అదే జరిగిందని చెప్పింది. అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ సినిమా పరదా ఈ నెల 22న విడుదల కానుంది.