మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లలో విడుదలకు రెడీ అయిపోయింది. జనవరి 14 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. అందులో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి సుమన్ టీవీతోనూ మాట్లాడారు. పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక రీసెంట్ గా నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా.. మెగాబ్రదర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై నాగబాబు ఘాటుగానే స్పందించారు. ఇప్పుడు ఇదే విషయమై చిరంజీవి ప్రశ్నించగా.. ఆయన చాలా కూల్ గా మాట్లాడుతూ రోజా వ్యాఖ్యలపై తొలిసారి స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి, 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అప్పట్లో కొన్ని సీట్లు కూడా గెలిచారు. కానీ తనకు ఈ పాలిటిక్స్ సెట్ కావని తెలిసి ఆ టర్మ్ తర్వాత పూర్తిగా తప్పుకొన్నారు. ఖైదీ నంబర్ 150 మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరు.. పూర్తిగా సినిమాలకే పరిమితమైపోయారు. ఇక పాలిటికల్ గా ఎలాంటి ఆసక్తి చూపించట్లేదు. ఇక చిరు తమ్ముడు పవన్ కల్యాణ్ మాత్రం జనసేన పార్టీని పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై తన అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ ని వైసీపీ నేతలు ఎప్పటికప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజా మాత్రం.. మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురిని సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారని అన్నారు. సాయం చేయని కారణంగానే రాజకీయాల్లో ప్రజలు వీరిని ఆదరించలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఇదే విషయం గురించి చిరుని అడగ్గా.. ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.
‘నేను దీనిపై కామెంట్ చేయను. ఎందుకంటే నేను ప్రజలకు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తోపాటు కరోనా టైంలో సినిమా వాళ్లకు సాయం చేశాను. ఇవి నా హెల్పింగ్ నేచర్ కు నిలువెత్తు సమాధానాలు. ఒకవేళ ఆమె(రోజా) అన్నదానికి నేను ఆన్సర్ ఇస్తే.. నేను నా స్థాయిని తగ్గించుకున్నవాడిని అవుతాను. నాతో పాటు నటించారు. నాతో పాటు సెంటిమెంట్ పంచుకున్నారు. మా ఇంటికి వచ్చారు. ఇక్కడే భోజనం కూడా చేశారు. సొంత మనుషుల్లా తిరిగారు. వాళ్ల మెంటాలిటీ, నైజాం ప్రకారం మాట్లాడేస్తే.. నేను స్పందించేసి మాట్లాడటం నా నైజం కాదు. వాళ్లు ఏం మాట్లాడినా సరే వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాను’ అని చిరంజీవి చెప్పారు
‘ఎన్నిసార్లు అక్కా అక్కా అని.. సార్ సార్ అని మా ఇంట్లో భోజనం చేశారు. నేను ఆత్మీయంగా, మనస్ఫూర్తిగా ఆహ్వానించాను. వాళ్ల ఫ్రెండ్ షిప్ ని ఆస్వాదించాను. సెంటిమెంట్, ప్రేమ, వాత్సాల్యానికి నేను విలువిచ్చే మనిషిని. దానిపై కౌంటర్ ఇచ్చేసి వాళ్లని తగ్గించేసి.. నా సెంటిమెంట్, నేనిచ్చే విలువని పటాపంచలు చేసుకోను. వాళ్లేదైనా మాట్లాడాని అది వాళ్ల నైజం.. ఆ సెంటిమెంట్ కి నేను వాల్యూ ఇవ్వడం నా నైజం. ఇంకా ఇంకా ఏమేం మాట్లాడుతారో మాట్లాడనివ్వండి. సెంటిమెంట్, ప్రేమలకు, చూపించిన వాత్సాల్యానికి విలువే లేదా? ఇంతేనా ప్రపంచం. దేన్ని కోరి, దేన్ని ఆశించి.. ఇలా మాట్లాడుతారు. వాళ్లని చూస్తుంటే అనిపిస్తుంది.. రాజకీయాలంటే ఇలానే ఉండాలా? వేరే విధంగా ఉండకూడదా?’ అని చిరు రోజా వ్యాఖ్యలపై స్పందించారు. మరి రోజాకు చిరు ఇచ్చిన ఆన్సర్ పై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.