సాధారణంగా బాక్సాఫీస్ వద్ద ఫ్యాన్స్ సందడి అనేది పెద్ద సినిమాలు విడుదలైనప్పుడే కనిపిస్తుంటుంది. ప్రతి సంక్రాంతి సీజన్ స్టార్ హీరోలు, వారి ఫ్యాన్స్ చాలా ఇంపార్టెంట్ గా భావిస్తారు. అయితే.. ఈసారి రాబోతున్న సంక్రాంతి అటు నందమూరి ఫ్యాన్స్ కి, ఇటు మెగాఫ్యాన్స్ కి చాలా స్పెషల్ కాబోతుంది. ఎందుకంటే.. చాలా ఏళ్ళ తర్వాత నటసింహం బాలకృష్ణ నుండి వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నుండి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీపడబోతున్నాయి. గతంలో చాలాసార్లు ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలైన బ్లాక్ బస్టర్స్ అయిన సందర్భాలు ఉన్నాయి.. ఒకరిని మించి ఒకరి సినిమాలు విజయం సాధించిన విశేషాలు ఉన్నాయి.
ఈ క్రమంలో మళ్లీ బాలయ్య, చిరంజీవిల సినిమాలు వస్తున్నాయని తెలిసేసరికి ఫ్యాన్స్ లో ఎక్సయిట్ మెంట్ మామూలుగా లేదు. బాలయ్య, చిరు ఎప్పుడూ బాక్సాఫీస్ పోటీకి దిగినా.. ఆ సినిమాలు ఫ్యాన్స్ లో ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటాయి. ఈసారి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలలో ఏది ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుందనే పాయింట్ కూడా ఆసక్తిరేపుతోంది. సంక్రాంతి టైమ్ లో రికార్డులు సృష్టించడం వీరిద్దరికి కొత్తేమి కాదు. అయితే.. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత.. ఇప్పుడున్న ప్రేక్షకులు సినిమాలను చూసే విధానం పట్ల ఏది విజయం సాధిస్తుంది? అనేది కొత్త విషయం. ఇక రెండు సినిమాలు సంక్రాంతికే రాబోతున్నాయి. కాబట్టి, మెల్లగా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు.
అదీగాక వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు సినిమాలను మైత్రి మూవీస్ సంస్థ వారే నిర్మిస్తుండటం విశేషం. అటు బాలయ్య సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా.. మెగాస్టార్ సినిమాను బాబీ రూపొందిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పోటీ అనేది హీరోల మధ్యే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్, దేవిశ్రీ ప్రసాద్ ల మధ్య కూడా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా వాల్తేరు వీరయ్య నుండి ‘బాస్ పార్టీ’ డాన్స్ నెంబర్, వీరసింహారెడ్డి నుండి ‘జై బాలయ్య’ మాస్ ఆంథెమ్’ లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతానికి రెండు పాటలు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అంతేగాక ఇద్దరి ఫ్యాన్స్ ఆయా పాటలను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. అయితే.. ఈ రెండు పాటలలో అంటే.. ‘మెగా బాస్ పార్టీ’, ‘మాస్ జై బాలయ్య ఆంథెమ్’ వీటిలో మీకు ఏది బాగా నచ్చింది? కామెంట్స్ లో తెలియజేయండి.