పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం.. అటు ప్రేక్షకుల నుండి ఇటు విమర్శకుల వరకు ప్రశంసలు అందుకుంటూ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే.. తమ అభిమాన హీరోని ఇంత అద్భుతంగా చూపించిన దర్శకుడు ఎవరా అని అభిమానులు ఆరా తీస్తున్నారు.
సాగర్ కె. చంద్ర.. పవన్ కళ్యాణ్‌తో ‘భీమ్లా నాయక్’ చేసే వరకు ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. అంతగా పరిచయంలేని దర్శకుడిని పవన్ కళ్యాణ్ పిలిచి మరి తన సినిమాను అతని చేతిలో పెట్టారంటే మామూలు విషయం కాదు. పెద్ద హీరోలతో ఒక సినిమా కూడా చేయని ఓ కుర్ర దర్శకుడి చేతిలో పవన్ కళ్యాణ్ తన సినిమాను పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. అంత పెద్ద స్టార్ హీరోని అభిమానుల అంచనాలకు తగ్గకుండా తీశాడంటే అతిశయోక్తి కాదు కాదు.కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం :
సాగర్ కె. చంద్ర తెలంగాణ, నల్గొండలో జన్మించాడు. తల్లిదండ్రులు మారం రాంచంద్రారెడ్డి, సునీత. సాగర్ చంద్ర అసలు పేరు కళాసాగర్. ఇంటర్ వరకు నల్గొండలోనే చదివిన సాగర్, హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఆ తరువాత మాస్టర్స్ చదవడానికి అమెరికా వెళ్ళాడు. అమెరికాలో తాను చదివే సౌత్ ఇల్లినాయిస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఓ ఫిల్మ్ స్కూల్ లో జరిగే షూటింగ్స్ చూడడంతోపాటు, కొందరు విద్యార్థులతో ఏర్పడిన పరిచయం వల్ల సాగర్ కు సినిమా దర్శకత్వంపై ఆసక్తి కలిగింది. తను కూడా ఫిల్మ్‌స్కూల్లో చేరి కోర్స్ పూర్తిచేశాడు.
రెండేళ్ళ తరువాత ఉద్యోగాన్ని వదిలి 2009లో హైదరాబాద్‌కు వచ్చిన సాగర్ చంద్ర కొంతకాలం రవిబాబు, శ్రీధర్ రెడ్డిల అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. 2012లో శివాజీ, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘అయ్యారే’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. అయితే ఆ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. కొంతకాలం తరువాత 2016లో శ్రీవిష్ణు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ‘భీమ్లా నాయక్’ సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను.. మలయాళ చిత్రం ‘అయ్యప్పునుమ్ కోషియమ్’ సినిమాను రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అభిమాన హీరో సినిమాను వెండితెరపై చూడటానికి ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా, ఆత్రుతగా ఎదురు చూస్తుంటారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది తను ఆరాధించే స్టార్‌నే.. ఓ అభిమాని డైరెక్ట్ చేస్తే ఎలాంటి అనుభూతి ఉంటుందో మాటల్లో వర్ణించలేం. ప్రస్తుతం భీమ్లా నాయక్ దర్శకుడు కూడా ఇలానే ఫీలవుతున్నాడు. ఈ సినిమాలో తమ అభిమాన హీరోను అద్భుతంగా చుపించావంటూ సాగర్ చంద్రను పొగడ్తల్లో ముంచెత్తితున్నారు పవన్ అభిమానులు. భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్ అవుతావంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమాను తెరకెక్కించిన దర్సకుడు సాగర్ చంద్రపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.