ఏపీ ప్రభుత్వం సినిమాకు సంబంధించిన టికెట్ ధర, షో అంశంపై తీసుకున్న నిర్ణయాలు సినీ, రాజకీయ రంగాల్లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. సినిమాల విషయంలో ఒకే టికెట్ ధరగా నిర్ణయించడం, 4 ఆటల కంటే ఎక్కువ ప్రదర్శించకుండా ఉండేటట్లు.. పలు ఆసక్తికర నిర్ణయాలు ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కొందరు సిని పెద్దలు బహిరంగంగానే వ్యతిరేకించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది సినిమా వాళ్లకు నష్టం తెస్తుందని సినీరంగానికి సంబంధించిన కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులు సహాయ కోసం ప్రముఖ నిర్మాత, గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ భారీ విరాళాన్ని ప్రకటించారు.
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణం ఏపీలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు ఏపీలోని రాయలసీమ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. ఈ వరదలకు దాదాపు 50 మంది వరకు మృతిచెందినట్లు సమాచారం. భారీ వరదలకు తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు చాలా మంది ప్రముఖుల సీఎం సహాయనిధికి విరాళం ప్రకటిస్తున్నారు. ఇటీవల ఎంపీ వి. ప్రభాకర్ రెడ్డి భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసింది. తాజాగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్స్ట్ అధినేత అల్లు అరవింద్ రూ.10 లక్షల విరాళాన్ని ఏపీ ప్రభుత్వ సహాయనిధికి అందజేశారు.