మొదటి నుంచి ఆదిపురుష్ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాలోని రావణుడి పాత్ర గెటప్ ను తప్పుగా చూపించారని.. రామాయణంలో లేని వాటిని సినిమాలో చూపించారని.. కొన్ని సంభాషణలు అయితే చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. రామాయణాన్ని సరిగా చూపించలేదని కొందరు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. మేకర్స్ తీరును తప్పుబట్టింది.
రామాయణం చదివితేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఏదో తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. అలాంటిది రామాయణం కథను తెర మీద చూస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేము. ఇప్పటి వరకూ రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. రామాయణం కథని రిఫరెన్స్ గా తీసుకుని వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బాహుబలి సినిమా చూసుకుంటే.. అందులో ప్రభాస్ పాత్ర రాముడిదే. రామాయణంలోని పాత్రలని రిఫరెన్స్ గా తీసుకుని రాజమౌళి అంత గొప్పగా తీయగలిగారంటే.. ఇక రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ ఎలా ఉండాలి? అంతకంటే గొప్పగా ఉండాలి కదా. కానీ అలా లేదు. అందుకే సినిమాపై వ్యతిరేకత మొదలైంది.
ఇలాంటి ఇతిహాసాలను తీయడం రాజమౌళికే సాధ్యమవుతుందని.. బాలీవుడ్ వాళ్ళకి చేతకాదంటూ మండిపడుతున్నారు. ఆదిపురుష్ సినిమా విడుదలైన మొదటి వారంలో జోరు చూపించినా క్రమంగా కలెక్షన్ల పరంపర డ్రాప్ అవుతూ వచ్చింది. మొదటి నుంచి నెగిటివ్ టాక్ కూడా అలానే ఉంది. రామాయణంలోని పాత్రలను సరిగా చూపించలేదని.. కథను మార్చి చూపించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సినిమా ప్రభాస్ కెరీర్ లో మరోసారి బాంబు పేల్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని డైలాగ్స్ విషయంలో అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదిపురుష్ సినిమాలో ఆ డైలాగ్స్ ఏంటి.. దీనికి సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని సీరియస్ అయ్యింది.
అంతేకాదు మేకర్స్ పై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువుల సహనాన్ని ఎందుకు పరీక్షిస్తున్నారు.. భవిష్యత్తు తరాలకు మీరు ఏం నేర్పించాలనుకుంటున్నారంటూ మండిపడింది. ఆదిపురుష్ సినిమాలోని పలు డైలాగులపై అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నిరసనలు కూడా జరిగాయి. సినిమాను బ్యాన్ చేయాలని కొంతమంది కోర్టుల్లో పిటిషన్ కూడా వేశారు. ఈ క్రమంలో అలహాబాద్ హైకోర్టులో వేసిన పిటిషన్ ను విచారించడం జరిగింది. సెన్సార్ బోర్డు తీరును తప్పుబట్టింది. రామాయణం లాంటి గొప్ప ఇతిహాసంలో ఇలాంటి డైలాగులు పెట్టడాన్ని ఎలా అనుమతిస్తారంటూ సెన్సార్ బోర్డుని ప్రశ్నించింది.
అయితే మేకర్స్ తీసింది రామాయణం కాదని.. సినిమా ప్రారంభంలో డిస్క్లైమర్ వేశామని చెబుతున్న దాన్ని కోర్టు ఖండించింది. డిస్క్లైమర్ పెట్టిన మేకర్స్.. ఈ దేశ ప్రజలను, యువతను బుద్ధి హీనులని అనుకుంటున్నారా? రాముడ్ని, లక్ష్మణుడిని, హనుమాన్ ని, రావణుడిని, లంకను చూపించి రామాయణం కాదు అంటున్నారు అంటూ మేకర్స్ తీరును తప్పుబట్టింది. ఈ కేసుకి సంబంధించి విచారణ ఇవాళ కొనసాగనుంది. ఇదిలా ఉంటే ఆదిపురుష్ సినిమాలోని అభ్యంతర డైలాగులను మార్చినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు కలెక్షన్స్ భారీగా తగ్గడంతో టికెట్ ధరలు సగానికి పైగా తగ్గించింది.