ప్రభుత్వ ఉద్యోగానికి గొప్ప గొప్ప చదువులు అవసరం లేదు. సమర్ధవంతంగా, నిజాయితీగా పని చేయాలే గానీ పదో తరగతి కూడా గొప్ప చదువుతో సమానంగా పరిగణించబడుతుంది. రేషన్ డీలర్ గా పని చేయడానికి ప్రభుత్వం నిరుద్యోగులకు సువర్ణావకాశం కల్పిస్తుంది. పదో తరగతి పాసైన వారి కోసం రేషన్ డీలర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రేషన్ డీలర్ ఉద్యోగం అంటే మీకు అవగాహన ఉండే ఉంటుంది. ఊరు దాటే పని లేదు. సొంత ఊర్లోనే ఉంటూ కలర్ ఎగరేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవచ్చు. పైగా డబ్బులు కూడా బాగా సంపాదించుకోవచ్చు. పదో తరగతి పాసై.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
పదో తరగతి అర్హతతో రేషన్ డీలర్లుగా పని చేసే అవకాశం కల్పిస్తుంది. పౌర సరఫరాలు ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రేషన్ డీలర్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న పలు మండలాల్లోని గ్రామాల్లో రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులను ఆహ్వానిస్తోంది. పది లేదా ఆపై చదువులు చదివిన వారికి రేషన్ డీలర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. మరి రేషన్ డీలర్ పోస్టుకి సంబంధించి అర్హతలు, ఏ ఏ గ్రామాల్లో ఖాళీలు ఉన్నాయి? వయసు పరిమితి ఎంత ఉండాలి? వంటి వివరాలు మీ కోసం.
దరఖాస్తు దారులు కనీస విద్యార్హత పదవ తరగతి పాసై ఉండాలి.పదవ తరగతి కంటే ఎక్కువ చదువు అంటే డిగ్రీ, ఇంటర్ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు పరిమితి 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తుదారులు ఎలాంటి సివిల్/క్రిమినల్ కేసులు కలిగి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం రెండు విధాలుగా ఉంటుంది.
80 మార్కులతో రాత పరీక్ష, 20 మార్కులతో ఇంటర్వ్యూ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్ లైన్ లో చేసుకోవాలి. రాజస్య మండలాధికారి గారి కార్యాలయం, ఆదిలాబాద్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 22 2023 ఆదివారం నాడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 27 2023 శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ లోని రాజస్య మండలాధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకి ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాలి.