రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదల కానుంది. భారీగా పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. 10 వేల నుంచి 15 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది.
గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై, ఇతర విభాగాల్లోని ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అన్ని రకాల నోటిఫికేషన్లు విడుదలవ్వడమే కాకుండా.. వాటి నియామక ప్రక్రియ కూడా కొనసాగుతోంది. గ్రూప్ 1, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల నియమాక ప్రక్రియ తుది దశకు చేరుకోగా.. ఇక మిగిలిన ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్ కూడా త్వరలోనే జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంతోకాలంగా ఆశగా ఎదురు చూస్తున్న ఎంతోమంది నిరుద్యోగ అభ్యర్థుల కల నిజమవుతుంది. 10 వేల నుంచి 15 వేల టీచర్ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ జారీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.
చాలా కాలం తర్వాత రాష్ట్రంలో ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ద్వారా మెగా డీఎస్సీ లేదా టీఆర్టీ ఉంటుందని బీఈడీ, డీఈడీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 10 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులు 13 వేల ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. టీచర్ల హేతుబద్దీకరణ తర్వాత 5 వేలకు పైగా మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. దీంతో 10 వేల నుంచి 15 వేల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
దరఖాస్తుల ప్రక్రియ, సీనియారిటీ జాబితా తదితర ప్రక్రియ నడుస్తోంది. 317 జీవో ద్వారా బదిలీ అయిన టీచర్లకు కూడా సాధారణ బదిలీలో అవకాశం ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మార్చి నెల వరకూ కొనసాగనుంది. బదిలీ ఉపాధ్యాయులు ప్రస్తుతం పని చేసే పాఠశాల నుంచి కొత్త చోటుకు బదిలీ అయిన పాఠశాలకు ఏప్రిల్ 24న రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అప్పటి వరకూ పాత పాఠశాలలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే గానీ స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు, సెకండరీ గ్రేడ్ టీచర్ ఖాళీలు ఎన్ని ఉన్నాయన్న విషయం తెలియదు.
ఉపాధ్యాయ ఖాళీలు లెక్క తేలిన తర్వాత టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగియనుండటంతో.. అదే నెలలో టీచర్ల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉపాధ్యాయ పోస్టుల నియామకాన్ని డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీకి (డీఎస్సీకి) అప్పగిస్తారా లేక టీఎస్పీఎస్సీకి అప్పగిస్తారా? అనే అంశంపై విద్యాశాఖ ఇంతవరకూ స్పష్టత ఇవ్వలేదు. సీఎస్ గా సోమేశ్ కుమార్ ఉన్నప్పుడు డీఎస్సీకే మొగ్గు చూపినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం సీఎస్ గా శాంతికుమారి ఉండడంతో టీచర్ల నియామక ప్రక్రియ డీఎస్సీకి అప్పగిస్తారా? లేక టీఎస్పీఎస్సీకి అప్పగిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే 10 వేల నుంచి 15 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.