ఐపీఎల్ దెబ్బకు టీమిండియా అభిమానుల్లో కొత్త భయాలు మొదలయ్యాయి. ఫైనల్ మ్యాచ్ సీన్ రిపీటైతే ప్రతిష్టాత్మక రెండు టోర్నీలు జరగడం అనుమానమేనని వాళ్లు ఆందోళన చెందుతున్నారు.
ఐపీఎల్-2023 ఎట్టకేలకు ముగిసింది. దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఎంటర్టైన్ చేసిన ఈ టోర్నీకి.. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఎండ్ కార్డు పడింది. హేమాహేమీలైన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ ఫైట్‌లో విజయం ధోని సేనను వరించింది. ఐదో టైటిల్‌ను అందుకోవడంతో సీఎస్కే, ఆ టీమ్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అయితే ఈ ఐపీఎల్ ఫైనల్ దెబ్బతో టీమిండియా అభిమానులకు కొత్త భయం పట్టుకుంది. చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు వర్షం వల్ల తీవ్ర అంతరాయం కలిగింది. ఆదివారం జరగాల్సిన ఫైనల్ కాస్తా వరుణుడి వల్ల సోమవారానికి పోస్ట్‌పోన్ అయింది. రిజర్వ్ డే నాడు కూడా వర్షం ఇరు జట్లతో దోబూచులాడింది. గుజరాత్ ఇన్నింగ్స్ సాఫీగానే సాగినప్పటికీ.. సీఎస్కే బ్యాటింగ్ సమయంలో వర్షం కారణంగా మళ్లీ అంతరాయం ఏర్పడింది.
వర్షం వల్ల తడిసిన గ్రౌండ్‌ను, పిచ్‌ను ఆరబెట్టేందుకు ఆధునిక టెక్నాలజీని గాక.. స్పాంజీలు లాంటివి వాడటంతో ఆలస్యమైంది. దీంతో మ్యాచ్ తిరిగి అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలకు మొదలైంది. వాన వల్ల ఐపీఎల్ ఫైనల్‌ను ఎంజాయ్ చేయాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. మ్యాచ్ చూసేందుకు అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇదే భారత జట్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. జూన్ 7 నుంచి 11 వరకు జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కూ వాన గండం ఉంది. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఇంగ్లండ్‌లో జూన్ నుంచి ఆగస్టు నెల వరకు భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కూ ఇదే సమస్య ఎదురుకానుంది. ఈ టోర్నీ జరగనున్న భారత్‌లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెల వరకు వానలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు టోర్నీల విషయంలో టీమిండియా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఐపీఎల్ ఫైనల్ సీన్ రిపీటైతే ఈ రెండు టోర్నీలు జరగడం కష్టమని అంటున్నారు.