ఏది ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. టెక్నాలజీ అందుబాటులో ఉంది కదా అని అన్నింటికీ వాడేస్తే ఇలానే ఉంటుంది. చాట్‌జీపీటీ సలహాతో తీవ్ర అనారోగ్యం పాలై మూడు వారాలు ఆసుపత్రి బెడ్డెక్కాల్సి వచ్చింది. ఎక్కడ జరిగింది. ఏమైందసలు..
టెక్నాలజీ రోజురోజుకూ విస్తృతమౌతోంది. ఆధునిక జీవనశైలిని పెరుగుతున్న టెక్నాలజీ సులభతరం చేస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో వచ్చాక మరింత వెసులుబాటు కలుగుతోంది. అయితే ఎలాంటి అంశాలకు చాట్‌జీపీటీ ఉపయోగించవచ్చనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన అంశాల్లో టెక్నాలజీ సహాయం మంచిది కానే కాదు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే వైద్యుడిని సంప్రదించాలే తప్ప చాట్ జీపీటీ సలహాలు అడిగి పాటించకూడదు. లేకపోతే ఇదిగో ఈ వ్యక్తికి ఎదురైన పరిస్థితే ఉంటుంది. చాట్‌జీపీటీ ఎంతగా అభివృద్ధి చెందినా క్వాలిఫైడ్ వైద్యుడిని రీప్లేస్ చేసేంత పరిస్థితి రాలేదింకా. భవిష్యత్తులో ఉండకపోవచ్చు కూడా.
న్యూయార్క్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తి చాట్‌జీపీటీ సలహా పాటించడంతో మూడు వారాలు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. తన రెగ్యులర్ ఫుడ్ డైట్ నుంచి సోడియం క్లోరైడ్ అంటే ఉప్పుని ఎలా తగ్గించాలని చాట్‌జీపీటీని అడిగితే ఉప్పుకు ప్రత్యామ్నాయంగా సోడియం బ్రోమైడ్ వాడాలని సూచించింది. వాస్తవానికి సోడియం బ్రోమైడ్‌ను గతంలో కొన్ని మందుల్లో ఉపయోగించేవారు కానీ పరిమాణం మించితే విషపూరితమౌతోందని వాడటం లేదు. అయితే ఇదంతా తెలియని ఆ వ్యక్తి చాట్‌జీపీటీ చెప్పింది కదా అని సోడియం బ్రోమైడ్ మూడు నెలలు వాడేశాడు. దాంతో ఆ వ్యక్తిలో తీవ్రమైన భయం, గందరగోళం, చికాకు, తీవ్రమైన దాహం, మానసిక అప్రశాంతతతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అంటే సోడియం బ్రోమైడ్ ఇతనిలో విష ప్రభావం చూపించింది.
వెంటనే వైద్యుడిని సంప్రదించడంతో తక్షణ చికిత్సగా శరీరంలో వాటర్, ఎలక్ట్రోలైట్స్ సమస్యను సరి చేశారు. దాదాపు మూడు వారాలు ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తే గానీ సాధారణ స్థితికి రాలేదు. శరీరంలో సోడియం, క్లోరైడ్ స్థాయి తిరిగి యధాతధ స్థితికి వచ్చాకే అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటన మీడియాలో పాపులర్ అవడంతో వైద్యులు కీలకమైన సూచనలు చేస్తున్నారు. ఆరోగ్య విషయాల్లో చాట్‌జీపీటీ లేదా ఏఐ టూల్స్‌ను ఆశ్రయించవద్దంటున్నారు.