నేటి ఆధునిక కాలంలో ఆఫీస్ టెన్షన్లు, అర్ధరాత్రి దాకా కంప్యూటర్ల ముందు పనిచేయడం వల్ల చాలామందికి కంటినిండా నిద్ర కరువైంది. ‘ది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్ – 2024’ నివేదిక ప్రకారం, ప్రస్తుతం మన దేశంలో దాదాపు 50 శాతం మంది తీవ్రమైన నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు. అయితే అందరూ నిద్ర కోసం కష్టపడుతుంటే, ఒక మహిళ మాత్రం హాయిగా నిద్రపోయి ఏకంగా 9 లక్షల రూపాయల భారీ నగదు బహుమతిని సొంతం చేసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ హోమ్ సొల్యూషన్స్ స్టార్టప్ సంస్థ నిర్వహించిన వినూత్నమైన కాంపిటీషన్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది.
నిత్యం ఉరుకులు పరుగుల జీవితం, పని ఒత్తిడి వల్ల నిద్రను నిర్లక్ష్యం చేస్తున్న జనాభాకు దాని ప్రాముఖ్యతను వివరించడానికి బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘వేక్‌ఫిట్’ప్రతి ఏటా ఒక క్రేజీ కాంపిటీషన్‌ను నిర్వహిస్తోంది. అదే ‘స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్’.
ఈ ఏడాది మూడో సీజన్ కోసం దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల మందికి పైగా అప్లై చేసుకోగా, వారిలో కేవలం 12 మందిని మాత్రమే ఫైనల్స్‌కు ఎంపిక చేశారు. ఈ పోటీ నియమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు రోజూ రాత్రి పూట 8 నుండి 9 గంటల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా పడుకోవాలి. అలాగే పగటిపూట కూడా ఒక 20 నిమిషాల పాటు చిన్న కునుకు (పవర్ నాప్) తీయాలి. వీరికి కంపెనీ తరఫునే ఒక లగ్జరీ మ్యాట్రెస్ (పరుపు)తో పాటు నిద్రను ట్రాక్ చేసే కాంటాక్ట్‌లెస్ స్లీప్ ట్రాకర్‌ను ఇస్తారు. వీటి సాయంతో నిపుణులు వారి నిద్ర క్వాలిటీని నిరంతరం మానిటర్ చేస్తారు.
తీవ్రమైన పోటీ నడుమ సాగిన ఈ థర్డ్ సీజన్లో అత్యధికంగా 99% స్లీప్ ఎఫిషియన్సీ సాధించి, బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కమ్ ఆడిటర్ సాయీశ్వరి పాటిల్ విజేతగా నిలిచారు. ఆమెకు ‘స్లీప్ ఛాంపియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో పాటు రూ. 9 లక్షల ప్రైజ్ మనీ లభించింది. అలాగే ఫైనల్ చేరిన మిగతా 11 మందికి కూడా ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున స్టైపెండ్ ఇచ్చారు.
కరోనా తర్వాత నా లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఆడిటర్‌గా పని ఒత్తిడి వల్ల సరిగ్గా నిద్రపట్టేది కాదు. కానీ ఈ స్లీప్ ఇంటర్న్‌షిప్ నా అలవాట్లను మార్చింది. ఒక క్రమశిక్షణతో కూడిన నిద్రను ఎలా అలవాటు చేసుకోవాలో నేర్పింది. ప్రశాంతమైన మైండ్ సెట్ ఉంటేనే మంచి నిద్ర పడుతుందని అర్థమైంది” అని సాయీశ్వరి పాటిల్ తన ఆనందాన్ని పంచుకున్నారు.
గడిచిన మూడు సీజన్లలో ఈ సంస్థ ద్వారా దాదాపు 51 మంది స్లీప్ ఇంటర్న్స్ రూ. 63 లక్షల వరకు సంపాదించడం గమనార్హం.
లక్షల రూపాయల బహుమతి మాట పక్కన పెడితే.. ఈ స్టోరీ మన అందరికీ ఇచ్చే సందేశం ఒక్కటే. లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా, ఎంత వర్క్ ప్రెజర్ ఉన్నా ఆరోగ్యానికి సరైన నిద్ర చాలా ముఖ్యం. కాబట్టి కాసేపు స్మార్ట్ఫోన్లను పక్కన పెట్టి ప్రశాంతంగా నిద్రపోవడానికి ట్రై చేయండి.
