ఈరోజుల్లో మంచికి రోజులు లేవు అని ఊరికే అనట్లేదు. ఏదో మంచిగా బతకండమ్మా అని చెప్పేందుకు వెళ్లిన ఓ మహిళ.. మృతదేహంగా మారింది. భార్యతో గొడవులెందుకు బిడ్డా మంచిగా బతుకు అన్నందుకు కత్తితో అత్యంత కిరాతకంగా పొడిచి చంపాడో దుర్మార్గుడు. తెలంగాణ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం పరిధిలో జరిగింది ఈ దారుణం.
పోలీసుల కథనం ప్రకారం.. చింతచెట్టు తండా పంచాయతీ పరిధిలోని జేత్యతండాకు చెందిన మూడావత్ రవి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వ్యవసాయం చేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలుతో ఆనందంగా గడిపే అతను.. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగే విషయంలోనే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అలా ఒకరోజు పొద్దున్నే పీకలదాకా మందు తాగి ఇంటికొచ్చిన రవిని భార్య నిలదీసింది. మందు తాగనివ్వకపోతే గొంతు కోసుకుని చస్తానంటూ కత్తితో వీరంగం వేశాడు. విసుగొచ్చిన భార్య విజయ పిల్లల్ని తీసుకుని తండాలోని బంధువు ఇంటికి వెళ్లింది.
ఇద్దరూ గొడవ పడటం చూసి ఎదురింటి ఇస్లావత్ బంగారి(60) సర్దిచెప్పేందుకు వెళ్లింది. బిడ్డా అలా గొడవలు పడకు.. పెళ్లాంతో మంచిగా కాపురం చేసుకో అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రవి కత్తి తీసుకుని పాశవికంగా బంగారిని ఎడమవైపు ఛాతిలో పొడిచాడు. ఒక్కసారిగా కుప్పకూలిన ఇస్లావత్ బంగారి ప్రాణాలు విడిచింది. చుట్టుపక్కల వాళ్లు వచ్చేసరికి రక్తపు మడుగులో ఉన్న మహిళను చూసి పోలీసులకు సమాచారం అదించారు. రవిని తాళ్లతో బంధించి పోలీసులకు అప్పగించారు. బంగారి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో జరుగుతున్న దారుణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
