భూమి మీద జీవించే ప్రతి జీవికి సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ కేవలం మనిషి మాత్రమే సమస్యలకు భయపడి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉంటాడు. ఈ చరాచర జీవుల్లో అత్యంత తెలివైన వాడు మానవుడు. కానీ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం అత్యంత మూర్ఖుడిగా ఆత్మహత్య ఆలోచన చేస్తాడు. అత్యంత అరుదుగా లభించే ఈ మానవ జన్మను ఆస్వాదించాలి. రేయింబవళ్లు లాగా కష్టసుఖాలు వస్తుపోతూ ఉంటాయి. కొందరు జీవితంలో ఎదురయ్యే సమస్యలు పెద్దవిగా ఉహించుకుని..వాటికి పరిష్కారం చావే అన్నట్లు భావిస్తారు. ముఖ్యంగా నేటికాలం కొందరు యువత తమ జీవితంలో ఎదురయ్యే ఆరోగ్య,ఆర్ధిక, ఇతర సమస్యలకు భయపడి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా 20 ఏళ్ల యువతి యువతి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ.. ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వైఎస్ యస్ఆర్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరం జాంబవంతుని వీధికి చెందిన విద్యార్థిని నల్లా శ్యామల కడపలోని ఓ ప్రైవేటు కళాశాలలో బి.కామ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. చదువులో బాగా రాణించి జీవితంలో ఉన్నతస్థితిలో స్థిరపడాలని ఆమె ఆశపడేది. ఈ క్రమంలోనే చదువులో నిర్లక్ష్యం చేయకుండా బాగా కష్టపడుతూ చదివేది. స్నేహితులతో సైతం చాలా కలివిడిగా ఉండేది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ గత కొన్నాళ్ల నుంచి మానసిక సమస్యతో ఇబ్బందులు పడుతోంది. మంగళవారం రాత్రి నాన్నమ్మ దగ్గరకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి నేరుగా సమీపంలో ఉన్న రైల్ ట్రాక్ వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న కడప రైల్వే పోలీసులు బుధవారం ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై తెలిపారు. అయితే శ్యామల పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. శ్యామల మృతితో ఆమె బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఏదైన సమస్య ఉంటే తమకు చెప్పి ఉంటే.. ఈఘోరం జరిగి ఉండేది కాదని ఆమె బంధువులు తెలిపారు.