ప్రతి మనిషి తన జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటారు. తన కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవించాలని దేవుళ్లను ప్రార్ధిస్తుంటారు. అయితే జీవితంపై చాలా ఆశలు పెట్టుకున్న కొందరి కుటుంబాల్లో అనుకొన్ని ఘటనలు విషాదాన్ని నింపుతాయి. తాజాగా ఓ మహిళ కుటుంబంలోనూ అదే జరిగింది. తన భర్త, పిల్లలు బాగుండాలని దేవుడి ప్రార్ధించేందుకు గుడికి బయలు దేరింది. అయితే మార్గం మధ్యలో లారీ రూపంలో మృత్యువు వచ్చి..ఆమెను బలి తీసుకుంది. ఇక్కడ ఇంకొ దారుణం ఏమిటంటే.. ఆ మహిళతో పాటు పదో తరగతి చదువుతున్న ఓ పాప కుడా ఈ ఘటనలో అశువులు బాసింది. ఈ దారుణమైన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కాకినాడ జిల్లా సామర్ల కోట మండలం వేట్లపాలెం పంచాయతీ పరిధిలోని జొన్నలదొడ్డి ప్రాంతానికి చెందిన కటారి హేమ, ఆనందాల లోవ, మనుపర్తి పావని, విసంశెట్టి రమణ, మరో మహిళతో కలిసి తూర్పు గోదావరి జిల్లాలోని బలభద్రపురంలోని సాయిబాబా ఆలయానికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం వారందరూ సాయిబాబా గుడికి కాలి నడకన పయనమయ్యారు. ఇదే సమయంలో పదో తరగతి చదువుతున్న విజయలక్ష్మి అనే అమ్మాయి..తాను కూడా బాబా గుడికి వస్తానని చెప్పింది. దీంతో విద్యార్ధిని తల్లి ఆనందాల లోవ కుమార్తెను తన వెంట తీసుకెళ్లింది. గ్రామం నుంచి నడుచుకుంటూ పి.బి. దేవం అనే గ్రామం సమీపంలోకి వెళ్లారు. ఇదే సమయంలో విశాఖపట్నం నుంచి కొమరగిరికి సిమెంటు లోడుతో వస్తున్న లారీ..నడుచుకుంటూ వెళ్తున్న వీరిని వెనుక నుంచి ఢీ కొట్టి..పక్కనే ఉన్న గోదావరి కాలువలో బోల్తా పడింది. దీంతో విజయలక్ష్మి(14), కటారి హేమ(25) అక్కడిక్కడే మృతి చెందగా, మిగిలిన వారికి తీవ్రగాయలయ్యాయి.
క్షత్రగాత్రులను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని రోదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏఎస్ఐ సింహాద్రి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరైన హేమ భర్త టీవీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. వారికి 2, 4 తరగతులు చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతితో పిల్లలు తల్లిలేని వారయ్యారు. అందరం బాగుండాలని పూజలు చేయించేందుకు గుడికి వెళ్లి..తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయవంటూ భర్త కుమార్, కుటుంబ సభ్యులు రోదించిన తీరు స్థానికుల హృదయాలను కదిలిచింది. ఓ పక్క గాయాలతో, మరో పక్క కుమార్తె మృతితో తల్లడిల్లిన అనందాల లోవ రోదనలు వింటున్న ప్రతి ఒక్కరి కళ్ల నీటి సుడులు తిరిగాయి. ఎవరో చేసిన నిర్లక్ష్యానికి రెండు కుటుంబాల్లో విషాదం నిండింది.