సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుంది అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. సినిమాల ప్రభావం సమాజంపై ఉండదని కొందరు బలంగా నమ్ముతుంటారు. అలానే సినిమాల వలన సమాజంలో చెడు బాగా పెరిగిపోతుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరి వాదనలు ఎలా ఉన్నా.. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు.. ప్రేక్షకులను సినిమాలు ప్రభావితం చేస్తున్నాయని అనక తప్పదు. దృశ్యం సినిమాను చూసే హత్య చేశామని ఓ హత్య కేసు నిందితులు తెలిపారు. అలానే దొంగతనాలకు, హత్యాచారాలకు పాల్పడిన కొందరు.. తాము సినిమాలను చూసి ఈ ఘటనలకు పాల్పడ్డామని విచారణలో వెల్లడించారు. తాజాగా చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా విస్తుతపోయే విషయం ఒకటి చెప్పారు. తాము ఖాకీ సినిమా స్ఫూర్తితో ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను కృష్ణా జిల్లా గుడివాడ గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం గుడివాడలోని గౌతమ్ స్కూల్ ప్రాంతంలో జరిగిన ఓ చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేశారు. ఈ క్రమంలో దాదాపు 150 సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. ఈ క్రమంలో లారీ ద్వారా ఈ దొంగల ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.12.5 లక్షల విలువైన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన నిందితులను విచారించగా విస్తుతపోయే విషయాలను తెలిపారు. కార్తీ హీరోగా నటించిన ఖాకీ సినిమా స్ఫూర్తితోనే లారీల్లో ప్రయాణిస్తూ తాము చోరీలకు పాల్పడుతున్నామని పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ నలుగురు ముఠా సభ్యులపై పలు రాష్ట్రాల్లో 18పైగా కేసులు నమోదు అయ్యాయని గుడివాడ డీఎస్పీ సత్యానంద్ అన్నారు. గుడివాడలో జరిగిన చోరీ కేసులో నగదు, ఆభరణాలను రికవరీ చేశామని, చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును చేధించి.. దొంగల ముఠాను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మరి.. సినిమాలు చూసి ఇలా అనేక దారుణాలు జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.