నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ విద్యార్థిని క్లాస్ రూంలోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అమ్రాబాద్ మండలం పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువుల ఆందోళనకు దిగారు.
విద్యార్థుల హత్యలు, ఆత్మహత్యలు తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరంగల్ ప్రీతి ఘటన మొదలు ఈ 15 రోజుల వ్యవధిలోనే దాదాపు 10 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకుంటే, నా ప్రియురాలికి దగ్గరవుతావా అంటూ హరహర కృష్ణ అనే యువకుడు, నవీన్ అనే తోటి విద్యార్థినిని పొట్టనపెట్టుకున్నాడు. ఈ ఘటనలు మరవక ముందే.. నార్సింగ్ లోని శ్రీ చైతన్య కళాశాలలో సాత్విక్ అనే విద్యార్థిని యాజమాన్యం వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాలపడ్డాడు. తాజాగా, మరో విద్యార్థిని ప్రాణం కోల్పోయింది. అభం శుభం తెలియని ఓ విద్యార్థిని క్లాస్ రూంలోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అమ్రాబాద్ మండలం పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.
అమ్రాబాద్ మండలం, మన్ననూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నిఖిత అనే విద్యార్థిని ఏడవ తరగతి చదువుతుంది. ఈ విద్యార్థినికి మూడు రోజుల క్రితం తోటి విద్యార్థినిలతో మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం పాఠశాల ఉపాధ్యాయులకు తెలియడంతో ఇద్దరు విద్యార్థినిలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఆ తరువాత ఏం జరిగిందో.. కానీ బాలిక క్లాస్‌రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న సాయంత్రం తోటి విద్యార్థులంతా గ్రౌండ్‌లో ఉన్న సమయంలో ఒంటరిగా తరగతి గదిలోకి వెళ్లిన బాలిక చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. తమ కూతురు చదువులులో వెనుకబడిందని.. క్లాస్ టీచర్ వేధించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే, స్కూల్ ప్రిన్సిపాల్ వాదన మరోలా ఉంది. గ్రౌండ్ టైంలో ఇద్దరు విద్యార్థినిలు గొడవ పడ్డారని, దీనిని అవమానంగా భావించి నిఖిత సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. బాలిక ఎందుకు చనిపోయింది..? దీనికి వెనుక ఉన్న ఇతర కకారణాలు ఏమైనా ఉన్నాయా..? అన్న దానిపై విచారణ చేపట్టారు.