ప్రేమ..ఓ పవిత్రమైన బంధం. అయితే.., కొంతమంది అవకాశవాదులు ఈ రోజుల్లో దాని విలువ తీస్తున్నారు. ముందు అందానికి ఆకర్షితులు అవుతూ, ఆ తరువాత డబ్బుకి ఆశ పడుతూ.., ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. వారిని కన్నా తల్లిదండ్రులకు కడుపు కొత మిగిలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లా చెన్నూరులో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో ఆరె సత్తయ్య శారద అనే దంపతులు జీవిస్తున్నారు. వీరికి నలుగురు కూతుళ్లు. భార్య భర్త వ్యవసాయ కూలీలే అయినా.., ఆడపిల్లలని కష్టపడి చదివించారు. మూడో కుమార్తె వెన్నెలను మంచిర్యాలలో బీకాం చేయడానికి చేర్పించారు. ఆ సమయంలో వీరి గ్రామానికే చెందిన పెండ్యాల కిరణ్‌కుమార్ ప్రేమ పేరుతో వెన్నలకి దగ్గర అయ్యాడు. “నువ్వు చాలా అందంగా ఉన్నావు. నాకు బాగా నచ్చావు, నిన్ను బాగా చూసుకుంటా.. పెళ్లి చేసుకుందామని ప్రాధేయపడ్డాడు. కానీ.., కులాలు వేరని, పెద్దలు పెళ్లికి అంగీకరించరని వెన్నెల అతని ప్రేమని ఒప్పుకోలేదు. కానీ.., కిరణ్‌కుమార్ ఆమె మాటలు వినలేదు. ఇంత అందాన్ని పొందలేకపోతే ఇక నేను బతకడం వేస్ట్. చనిపోతా అంటూ వెన్నలని బెదిరించాడు. దీంతో.., వెన్నల కూడా అతని మాటలకి కరిగిపోయింది. అతని ప్రేమలో పడి.., పెద్దలను ఎదిరించి కిరణ్ ని వివాహం చేసుకుంది.
పెళ్లి తరువాత కిరణ్‌కుమార్–వెన్నెల చెన్నూరులో కాపురం పెట్టారు. కిరణ్ క్లాత్ స్టోర్ ప్రారంభించాడు. కానీ.., కోవిడ్ కారణంగా వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో.., అతను కట్నం కోసం వెన్నలను వేధించడం మొదలుపెట్టాడు. రూ.10 లక్షల కట్నం తేవాలని చిత్ర హింసలు పెట్టాడు. మరోవైపు అత్తింటి వారు తక్కువ కులమని వెన్నలని నిత్యం వేధిస్తూ వచ్చారు. ఇలా భర్త ఆదరణ లేక, అత్తింటి పోరు భరించలేక, మోసపోయాను అమ్మ అంటూ పుట్టింటికి పోలేక.. వెన్నల ఆత్మహత్య చేసుకుంది. అయితే.., వెన్నల చనిపోయే ముందు మూడు పేజీల సూసైడ్ నోట్ రాసింది.
కిరణ్.. నా జీవితంలోకి ఎందుకొచ్చావ్? నిన్ను చేసుకోకముందు సంతోషంగా ఉండేదాన్ని. పెళ్లయ్యాక మనస్ఫూర్తిగా నవ్విన రోజు కూడా నాకు గుర్తులేదు. నువ్వు ఎన్నిసార్లు వేధింపులకు గురి చేసినా మావాళ్లకు చెప్పలేదు. నీ ఫ్రెండ్స్‌కు చెప్పాలనుకున్నా.. కానీ.., నీ పరువు పోతుందని చెప్పలేదు. ఇంకో జన్మంటూ ఉంటే మన కులంలోనే పుడుదాం అని ఆ లెటర్ లో పేర్కొంది. వెన్నల తండ్రి సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిరణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరి.. ప్రేమ, పెళ్లి పేరుతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఈ కిరణ్ లాంటి వారికి ఇలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.