పెళ్లీడుకొచ్చిన యువతి కఠిన నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. కళ్ల ముందే ఉరికంబానికి వేలాడుతున్న బిడ్డను చూసి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది. యువతి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది..? అసలేం జరిగింది..? అన్నది ఇప్పుడు చూద్దాం..
ప్రేమ పేరుతో దగ్గరవ్వడం.. నువ్వే నా సర్వస్వమంటూ కల్లు బొల్లి మాటలతో వంచించడం సమాజంలో ఎప్పుడు చోటుచేసుకునే సంఘటనలే. ఇలాంటి తరహా మాయమాటలతో యువకుల చేతుల్లో మోసపోయిన యువతులు ఎందరో ఉన్నారు. ‘యువకుడి చేతిలో మోసపోయిన యువతి’, ‘ప్రేమికుడు మొహం చాటేయడంతో అతడి ఇంటి ముందు దీక్షకు దిగిన యువతి” అంటూ ఎన్నో వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అయినప్పటికీ అమ్మాయిలు అప్రమత్తమవ్వడం లేదు. మోసపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. తాజాగా, ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అందుకు కారణం ప్రియుడు మోసం చేయడమేనని వదంతులు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు..
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం పరిధిలోని రాచాల గ్రామానికి చెందిన తేజస్విని (30) అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇంట్లో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. వారి ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే ఆమె మరణించింది. అయితే.. అందుకు కారణం ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడని చెప్తున్నారు యువతి కుటుంబీకులు. నాగాయిపల్లికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో వంచించాడని చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం తేజస్విని వద్దకు వచ్చి ఆదివారం వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నాన్నని, తనను వదిలేయాలని బెదరించాడని, దీని వల్ల మనస్థాపం చెందిన తేజస్విని ఉరివేసుకొందని వాపోయారు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు చేసినట్లు సమాచారం.