నేటి సోషల్ మీడియా యుగంలో పొద్దున మీటింగ్.. మధ్యాహ్నం చాటింగ్.. సాయంత్రం డేటింగ్.. రాత్రికి బ్రేకప్.. చెప్పుకునే రోజుల్లో ఓ అమ్మాయిని 5 సంవత్సరాలుగా ప్రాణంగా ప్రేమించాడు ఓ యువకుడు. తనే సర్వస్వం అని నమ్మిన అతడు ఆమెతో జీవితాన్ని సంతోషంగా ఊహించుకున్నాడు. కానీ విధి ఆడిన వింతనాటకమో లేక ఆ యువతి ఆడిన జగన్నాటకమో తెలీదు కానీ తన నిండు ప్రాణాలను ప్రేమ కోసం బలి తీసుకున్నాడు. ఐదేళ్లుగా ప్రేమించిన అమ్మాయి తనను కాదని వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో భరించలేని ఆ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
సలీమ్ – అనార్కలి, షాజహాన్ – ముంతాజ్, దేవదాసు – పార్వతి చరిత్రలో అజరామరంగా నిలిచిన ప్రేమకథలు. కానీ అన్ని ప్రేమకథలు వారిలా చరిత్రలో నిలిచిపోవు. చాలా ప్రేమ కథలకు శ్మశానాలే దేవాలయాలుగా నిలుస్తున్నాయి. ఐదేళ్లుగా సర్వస్వం తనే అని ప్రేమించిన ఓ భగ్నప్రేమికుడి సూసైడ్ సెల్పీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన రమణమ్మ, సుంకన్న దంపతులకు కుమారుడు ఆంజనేయులు(22), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆంజనేయులు కర్నూలులోని తమ బంధువల ఇంట్లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు.
ఈ క్రమంలోనే కర్నూల్ కు చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు ఆంజనేయులు. ఇద్దరు కలిసి ఐదేళ్లు గాఢంగా ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇంతలోనే ప్రియురాలు ఆంజనేయులు ను వదిలేసి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో ఆంజనేయులు భరించలేక పోయాడు. పైగా ఆమె వేరే వ్యక్తితో ఉన్న వీడియోలను, ఫొటోలను ఆంజనేయులుకు పంపించింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు సోమవారం తన స్వగ్రామం అయిన లక్ష్మాపురానికి వచ్చాడు. తండ్రితో కలిసి పొలానికి వెళ్లి.. ఇంటికి వెళ్తున్నాను అని తండ్రికి చెప్పి వెళ్లాడు. రాత్రి కావస్తున్న తన కొడుకు ఇంకా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడసాగారు. అప్పుడే వారికి తన కొడుకు సూసైడ్ సెల్పీ వీడియో వచ్చింది. దాంట్లో ఆంజనేయులు ఇలా చెప్పుకొచ్చాడు.
“నేను ఆ అమ్మాయిని సర్వస్వంగా ప్రేమించాను. కాను ఆమె నన్ను మోసం చేసి వేరే వ్యక్తితో వెళ్లింది. ఆమె లేకుండా నేను ఉండలేను అమ్మా. ఇద్దరు చెల్లెల్లకు ఆస్తి సమానంగా పంచండి. నన్ను క్షమించండి అమ్మా” అంటూ కన్నీరు పెట్టుకుంటూ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియో చూసి వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లారు వారు. అప్పటికే విగతజీవిగా పడి ఉన్న ఆంజనేయులును హుటాహుటిన కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆంజనేయులు మరణించాడు. దాంతో చేతికి అందివచ్చిన కొడుకు ఒక్కసారిగా ఇలా విగతజీవిగా పడి ఉండటంతో కన్నీరు మున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు. వారి బాధ స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. సుంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.