జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో దొొంగలు పడిన విషయం అందరికీ తెలిసిందే. కొంత మంది వ్యక్తులు గత నెల 23న ఆలయంలోకి చొరబడి లక్షలు విలువ చేసే ఆభరణాలను దొంగిలించారు. అయితే ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగలు పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసును పోలీసులు చేధించారు. ఈ దొంగతనంలో ప్రమేయం ఉన్న మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 23వ తేదీన అర్థరాత్రి గుడిలో దొంగలు చొరబడి 15 కిలోల వెండి, బంగారు నగలను ఎత్తుకెళ్లారు. రోజులాగానే గత నెల 23న అంజన్నకు పూజలు చేసి గుడికి తాళం వేసి పూజారులు వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు.. కటింగ్ ప్లేయర్, ఇతర సామాగ్రితో వచ్చి గుడిలో దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలోని స్వామివారి 2 కిలోల వెండి మకర తోరణం, అర్ధమండపంలోని 5 కిలోల ఆంజనేయస్వామి వెండి ఫ్రేమ్, 3 కిలోల నాలుగు వెండి శఠగోపాలు, స్వామివారి 5 కిలోల వెండి తొడుగు తదితర వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
వీటి విలువ సుమారు 9 లక్షల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేపట్టారు. సిసిటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 1న ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి రూ.3.50 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరో ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. వారి నుండి వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల డీఎస్పీ ఆర్.ప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం మల్యాల మండలం రాజారం గ్రామ శివారులో ఉన్న దాబా వద్ద కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
ఈ మేరకు అక్కడకు చేరుకున్నమల్యాల సీఐ రమణమూర్తి, ఎస్సై చిరంజీవి ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కొండగట్టు ఆలయంలో చోరీకి పాల్పడినట్లు తేలింది. నిందితులు కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన రాంశెట్టి జాదవ్, దేవీదాస్ జాదవ్, విఠల్‌రావ్ దేశ్‌ముఖ్‌గా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి రూ.8.40 లక్షల విలువైన 12 కిలోల వెండి కడ్డీలు స్వాధీనపరచుకున్నామని, ఈ కేసులో మరో ఇద్దరు రామారావ్ జాదవ్, విక్రం జాదవ్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితులంతా కూడా కర్ణాటకకు చెందిన వారని తెలిపారు. ఇదే గుడిలో పవన్ కళ్యాణ్ తన వాహనం వారాహికి పూజలు చేయించిన సంగతి విదితమే.