సమాజంలో తిండి ఎక్కువై అల్లాడే వారుంటారు. తిండి దొరక్క కడుపు మంటతో అలమటింటే వారు ఉంటారు. అలా ఆకలి మంటతో ఉన్న ఓ కార్మికుడు హూటల్ లో మిగిలిపోయిన బిర్యానీ కోసం వెళ్లాడు. అయితే, దొంగగా భావించిన హోటల్ సిబ్బంది తీవ్రంగా కొట్టడంతో ఆ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన హైదరాబాద్.. కూకట్పల్లిలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన రాజేష్ అనే కార్మికుడు భార్య, పిల్లలతో కలిసి హైదరాబాద్ లో మాదాపూర్ లో ఉంటున్నాడు.
గత కొన్ని రోజులుగా ప్రగతి నగర్ లో భవన నిర్మాణాల్లో పనిచేస్తోన్నాడు. అయితే, బుధవారం రాత్రి పని ముగించుకోని ప్రగతి నగర్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో జేఎన్ టీయూ హెచ్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న ఓ రెస్టారెంట్ దగ్గరకు వెళ్లాడు. ఆ రెస్టారెంట్ సెల్లర్ లోకి వెళ్లి.. మిగిలిపోయిన బిర్యానీని తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే రాజేష్ ను దొంగగా పొరబడిన ఆ హోటల్ సిబ్బంది.. అతడిని తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో రాజేష్ స్పృహతప్పి అక్కడే పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం హోటల్ కు వచ్చిన సిబ్బంది రాజేష్ అక్కడే ఉండడాన్ని గుర్తించారు.
రాజేష్ వద్ద దొరికిన ఫోన్ నెంబర్ ఆధారం అతని తండ్రికి సమాచారం ఇచ్చారు. ఆయన ఒడిశాలో ఉండటంతో హైదరాబాద్ లో ఉన్న కోడలికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఘటనా స్థలానికి వెళ్లిన ఆమె.. భర్తను ఇంటికి తీసుకెళ్లింది. కానీ, కాసేపటికే రాజేష్ కన్నుమూశాడు. ఆ హోటల్ వారు కొట్టిన దెబ్బలకే రాజేష్ మరణించాడని ఆయన భార్య ఫిర్యాదు చేసినట్లు, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.
