భారత రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పై వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాదిగలకు హక్కులు వచ్చింది అంబేడ్కర్ వల్ల కాదన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఎమ్మార్పీఎస్ నిర్వహించిన 4వ ప్రపంచ మాదిగ దినోత్సవ సభలో పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీదేవి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ వల్ల మాదిగలు హక్కులు సాధించుకోగలిగారు.. కానీ అంబేడ్కర్ వల్ల కాదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.
ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలు అంబేడ్కర్ ను అవమానించేలా ఉన్నాయని.. మాల మాదిగల మధ్య చిచ్చు రేపేలా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కు జగజ్జీవన్ రామ్ కు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదంటున్నారు. ఆమెను బర్తరఫ్ చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీదేవి వ్యాఖ్యలను నిరసిస్తూ పలుచోట్ల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాలు చేశారు.
ఇక దీనిపై ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. అంబేద్కర్ పై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, రాజ్యాంగ నిర్మాతను తాను దూషించాననడం అవాస్తవమని అన్నారు. తాను చిన్ననాటి నుంచి అంబేద్కర్ వాదినే అని స్పష్టం చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మార్ఫింగ్, ఎడిటింగ్ చేసిన వీడియోలను వైరల్ చేస్తున్నారని, అందువల్ల అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.