ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిపుణులైన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్ లో అడ్మిట్ అయిన మొదటిరోజుతో పోలిస్తే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా.. కుటుంబ సభ్యులకు భయం అనేది సహజం. అందుకే హిందూపురం నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తీసుకొచ్చినా.. అక్కడ కూడా పని అయ్యేలా లేదని.. విదేశాలకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ వెల్లడించారు. తారకరత్నను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలించే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలిపారు.
తారకరత్నకు చికిత్స కొనసాగుతోన్న నేపథ్యంలో.. టీడీపీ పార్టీ నేత, హిందూపురం పార్లమెంట్ కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ.. శుక్రవారం బెంగళూరు హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైద్యులు ఈరోజు తారకరత్న మెదడుకు స్కానింగ్ చేశారని.. రిపోర్టు ఆధారంగా మెదడు పనితీరు ఎలా ఉందో అనేది తెలుస్తుందని.. పరిస్థితిని బట్టి విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారని అన్నారు. తారకరత్నను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారని అన్నారు.
తారకరత్న తండ్రి మోహనకృష్ణ, ఆయన సతీమణి అలేఖ్య, పలువురు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇదిలా ఉంటే తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి చేరుకోవాలని, త్వరగా కోలుకోవాలని హిందూపురంకు చెందిన టీడీపీ నాయకులూ, కార్యకర్తలు పూజలు నిర్వహించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. తారకరత్న త్వరగా కోలుకోవాలని 101 కొబ్బరికాయలు కొట్టారు. మరి తారకరత్న ఆరోగ్యం కోలుకోవాలని.. తిరిగి మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిద్దాం.