సమాజంలో అద్భుతమైన దృశ్యాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కొన్ని దృశ్యాలు చూసినప్పుడు ఒళ్లంతా పులకరించి పోతుంది. అలాంటి అద్భుతమైన దృశ్యం విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
రైతు జీవితంలో పశు పోషణ అనేది చాలా ప్రధానమైనది. రైతులు వ్యవసాయంతో పాటు ఆవులు, గేదెలను పోషణ కూడా చూసుకుంటారు. పశువులను కూడా తమ ఇంట్లో ఒకరిగా భావిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అందుకే పశువులు కూడా తమ యజమానిపై ప్రేమను చూపిస్తుంటాయి. తమ యాజమానికి చిన్న దెబ్బ తగిలిన ఆ మూగజీవాలు అల్లాడిపోతుంటాయి. అంతేకాక ఇతర జంతువులపైనా ఈ ఆవులు, గేదెలు ప్రేమను చూపిస్తుంటాయి. కొన్ని సంఘటనలు చూసినప్పుడు మనుషుల కంటే మూగజీవాలే ఎంతో మేలు అనిపిస్తుంటాయి. తమ జాతి కానీ వాటిని కూడా ఆదరిస్తూ ఆహారాన్ని అందిస్తుంటాయి. కుక్కపిల్లలు, మేక పిల్లలకు ఆవు పాలు ఇచ్చిన ఘటనలు జరిగాయి. అయితే తాజాగా జరిగిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నందీశ్వరుడి విగ్రహాన్నికి ఓ ఆవు అరటిపండు అందించింది. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు పులకించారు. మరి.. ఎక్కడ జరిగింది ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని కోనాడ గ్రామంలో త్రిలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా ఆ ఆలయాన్ని అంగరంగ వైభవంగా అలకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి త్రిలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రసాదాలు అందించి.. భక్తి శ్రద్ధలతో పూజించారు. అయితే శివరాత్రి మరుసటి రోజైన ఆదివారం త్రిలింగేశ్వర స్వామి ఆలయంలో అరుదైన దృశ్యం భక్తులను పులకింప చేసింది. త్రిలింగేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఉన్న నంది విగ్రహం వద్ద భక్తులు ప్రసాదాలు పెట్టారు. నందీశ్వరుడి వద్ద భక్తులు పెట్టిన అరటి పండ్లను ఓ ఆవు తినేసింది. అంతేకాక ఆ నంది విగ్రహాన్ని కూడా ప్రాణం ఉన్న జీవిగా ఆ ఆవు భావించినట్లు ఉంది.
తాను తినడంతో పాటు అరటిపండును తినమన్నట్లు నంది విగ్రహం నోటి వద్దకు చేర్చింది. పలుమార్లు కింద పడిపోయిన తిరిగి ఆ అరటిపండును అందుకుని నందీశ్వరుడికి తినిపిస్తున్నట్లు ప్రయత్నించింది. ఇలా ఆవు చేసిన సందడి ఆలయానికి వచ్చిన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతి ప్రాణీలో దేవుడు ఉంటాడు అనేందుకు నిదర్శనం ఈ దృశ్యమని కొందరు భక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆవు తన కడుపు నింపుకోవడమే కాకుండా తన తోటి ప్రాణుల ఆకలి తీర్చే ప్రయత్నం చేసిందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాల సమయంలో ఇలాంటి దృశ్యం కనిపించడంతో భక్తులు పులకించి పోతున్నారు. మరి..ఈ అద్భుతమైన, అరుదైన దృశ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.