ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశం నలుమూల నుంచి భక్తులు వివిధ మార్గంలో తిరుపతికి చేరుకుంటారు. అలానే నిత్యం ఎన్నో వాహనాలు తిరుమలకు వెళ్తుంటాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశం నలుమూల నుంచి భక్తులు వివిధ మార్గంలో తిరుపతికి చేరుకుంటారు. అలానే నిత్యం ఎన్నో వాహనాలు తిరుమలకు వెళ్తుంటాయి. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఘాట్ రోడ్డు ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను, ట్రాఫిక్ ను నివారించేందుకు తాజాగా పోలీసులు పలు సూచనలు చేశారు. నింబధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
మంగళవారం తిరుమలలోని ట్రాఫిక్ పోలీసు స్టేషనులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ మునిరామయ్య మీడియాతో మాట్లాడారు. తిరుమల ఘాట్ రోడ్డులో నిబంధనలు అతిక్రమిస్తే ఆ వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా, తిరుమలకు ఆ వాహనాలను నిషేధిస్తామని ఆయన తెలిపారు. అలానే తిరుమల ఘాట్ రోడ్డులో జరుగుతున్న ప్రమాదాల నివారణకు టీటీడీ చర్యలు ప్రారంభించిందని చెప్పారు.
ఇంకా తిరుమల ట్రాఫిక్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారుల నేతృత్వంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. తిరుమల ఘాట్ రోడ్డులో వాహనదారులకు డ్రైవింగ్ పై అవగాహన లేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం, సెల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగం కారణంగా స్వల్ప రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సెల్ఫీలు తీసుకోవడం కోసం రోడ్డు పక్కన వాహనాలు ఆపడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఘాట్ రోడ్డులో అవగాహన కలిగిన డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడపాలని సూచించారు.
డ్రైవర్లకు అవగాహన కల్పించే విధంగా ట్రాఫిక్ పోలీసులు తిరుమల, తిరుపతిలోని పలు ప్రాంతాలలో సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామన్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో పోలీసుల నిబంధనలను అతిక్రమిస్తే, ఆ వాహనాలను పూర్తిగా తిరుమలకు నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ అన్నారు. మరి.. తిరుమల ట్రాఫిక్ పోలీసులు చేసిన హెచ్చరికలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.