బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చనుంది. ఆ తరువాత వాయుగుండంగా మారవచ్చు. ఈ క్రమంలో రానున్న 4 రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం దేశమంతా భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో కూడా వర్షాలు వీడటం లేదు. కొన్ని ప్రాంతాల్లో విరామం లేకుండా కుండపోత వర్షాలు పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో ఐఎండీ నుంచి మరో హెచ్చరిక జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రోజుల్లో తీవ్రరూపం దాల్చి ఆ తరువాత వాయుగుండంగా మారవచ్చు. ఫలితంగా సెప్టెంబర్ 24 నుంచి 27 వరకూ ఉత్తర కోస్తా, ఒడిశా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఏపీలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది.
ఇక తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో 2-3 రోజులుగా భారీ వర్షం విరుచుకుపడుతోంది. ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకూ హైదరాబాద్ నగరంలో భారీ వర్షం అలర్ట్ ఉంది. ఇక ఇవాళ్టి నుంచి రెండు రోజుల వరకూ మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు.