గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయిన సంగతి అందరికి తెలిసిందే. వారిద్దరు కలిసి పలు రాజకీయ అంశాల గురించి చర్చించారు. అనంతరం ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో సీఎంను కలిసిన ఆర్టీవీ.. 40 నిమిషాల పాటు మాట్లాడారు. ముఖ్యమంత్రితో కలిసి ఆర్జీవీ లంచ్ కూడా చేశారు. అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
గతంలో సినిమా టికెట్ల వివాదంలో సీఎంను ఆర్టీవీ కలిశారు. ఆ సమయంలో ఓ మంత్రికి, ఆర్టీవీకి మధ్య సోషల్ మీడియాలో వేదికగా మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో సీఎం జగన్ ను కలిసిన ఆయన ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలన్నది తన ఉద్దేశం కాదని తెలిపారు. అలానే వ్యక్తిగతంగా తనకు వైఎస్ జగన్ అంటే చాలా అభిమానమని ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ వెల్లడించారు. అయితే, తాజాగా మరోసారి సీఎం జగన్ మోహన్ రెడ్డిని రామ్ గోపాల్ వర్మ కలవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈక్రమంలో 40 నిమిషాల పాటు జగన్ తో భేటీ అయ్యారు. జగన్ తో కలిసి ఆర్టీవీ భోజనం కూడా చేశారు. కాగా ఎందుకు కలిసారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.