మహిళలు ఎక్కువగా మక్కువ చూపేదీ చీరలు కొనేందుకే. అందుబాటు ధరల్లో చీరలు లభిస్తున్నాయని షాపింగ్ మాల్స్ ప్రకటనలు చూస్తే చాలు పొద్దునే వాటి ముందు క్యూ కడతారు. ఇది చాలదన్నట్లు ఆన్ లైన్ వచ్చాక ఎక్కువగా షాపింగ్ పెరిగింది. దీన్నే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు దొంగలు.
మహిళలకు చీరలంటే ప్రాణం. వాటి కోసం గంటలు గంటలు షాపింగ్స్ చేస్తారు. సరసమైన ధరల్లో చీరలు అనగానే షాపింగ్ మాల్స్ ముందు క్యూ కడతారు. ఇది చాలదన్నట్లు ఆన్ లైన్ యాప్ ల ద్వారా దుస్తులు కొనుగోలు చేస్తారు. వీటిలో అధికంగా చీరలే ఉంటాయి. ఇదే విషయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఆన్ లైన్ మోసాలకు పాల్పడే వారు. చీరల పేరు చెప్పి నయా ఆన్ లైన్ మోసాలకు తెరలేపారు. మహిళల్ని బురిడీ కొట్టించి.. ఖాతాల్లో డబ్బులను దండుకుంటున్నారు. ఇటువంటి ఘటనే తాజాగా గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. ఆన్‌లైన్‌లో చీర కొనుగోలు చేసిన మహిళను లాటరీ పేరుతో ముంచేశారు ఆగంతకులు.
వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలానికి చెందిన ఓ మహిళ ఇటీవల ఆన్‌లైన్‌లో చీర కొనుగోలు చేశారు. రెండు రోజుల తర్వాత ఆర్డర్ రాగా, అందులో చీరతో పాటు ఓ స్క్రాచ్ కార్డు, మరో పేపర్ ఉంది. ఇంగ్లీష్‌లో ఉండటంతో ఆమె పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు సైతం చెప్పలేదు. అయితే ఓ వారం గడిచిన రోజుల తర్వాత ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము మీరు గతంలో ఆర్డర్ చేసిన సదరు ఆన్ లైన్ షాపింగ్ మాట్లాడుతున్నామని, మీకు ఓ స్రాచ్ కార్డును ఇచ్చామని, దాని చూశారా అని అడిగారు. తాను చూడలేదని, దానిపై ఆసక్తి లేదని సమాధానం ఇచ్చారు.
అయితే పలుమార్లు ఫోన్ చేసిన ఆగంతకుడు ఒకసారి ఆ కార్డును స్క్రాచ్ చేసి చూడమని చెప్పాడు. ఏ పనిలో ఉన్నా పదే పదే ఫోన్ చేసి విసుగెత్తిన ఆమె కార్డును స్క్రాచ్ చేశారు. మళ్లీ ఫోన్ చేసిన వ్యక్తి ఆ కార్డులో అందులో ఏముందని అడిగితే.. రూ.13.50 లక్షలున్నట్లు చెప్పారు. అయితే మీ చాలా లక్కీ అని, మీకు లాటరీ రూపంలో బంఫర్ ఆఫర్ వచ్చిందని అంటూ మాయ మాటలు చెప్పాడు. అయితే పలుమార్లు ఫోన్ చేసి చెప్పడంతో ఈ మాటలు నిజమేనని బాధిత మహిళ నమ్మింది. తనకు లాటరీ తగిలిందనుకుని భావించింది. అయితే మీ వివరాలు ఇవ్వాలని ఆగతంకుడు చెప్పగా.. ఆ పేపర్‌పై తన వివరాలు, బ్యాంకు అకౌంట్ నంబర్, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్లు రాసింది.
ఇంతలో అతడు మరోసారి కాల్ చేసి ఈ డబ్బులు మీ ఖాతాలో పడాలంటే.. ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాలని చెప్పాడు. ఓ బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్పి.. అందులో రూ.13,500 వేయమని తెలిపాడు. తనకు రూ.13.50 లక్షలు వస్తాయని అత్యాశతో..ఆమె అతడి మాటలు నమ్మి, డబ్బులు వేసింది. ఆ వ్యక్తి అక్కడితో ఆగకుండా ఇదే కారణం చెప్పి రెండు రోజుల్లో మొత్తం రూ.1.72 లక్షలు ఖాతాలో జమ చేయించుకున్నాడు. మళ్లీ ఫోన్ చేసి డబ్బులు వేయమని అడగటంతో ఆమెకు అనుమానం వ్యక్తం చేసింది. తిరిగి ఫోన్ చేస్తే కలవకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి ఆమె స్పందనలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మోసంపై స్పందించిన ఏఎస్పీ దర్యాప్తు చేసిన మహిళకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుండి లాటరీ అని, ఇతర మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.