ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు త్వరలోనే 26 జిల్లాలు కాబోతున్నాయి. ఈమేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఇప్పుడున్న జిల్లా కేంద్రాలకు పాత పేర్లే ఉంటుండగా.. కొత్తగా ఏర్పడే జిల్లాలకు కొన్ని జిల్లా కేంద్రాల పేర్లు, మరికొన్నిటికి బాలాజీ, అల్లూరి, సీతారామరాజు, అన్నమయ్య, సత్యసాయిబాబా, NTRల పేర్లు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అనూహ్యంగా టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరు తెరమీదకు వచ్చింది. ఓ జిల్లాకు ఏఎన్నార్ పేరు పెట్టమని ఏపీ సర్కారుకు అక్కినేని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడనున్న కొత్త జిల్లా మచిలీపట్నం. ఈ జిల్లాకు అక్కినేని నాగేశ్వరావు పేరు పెట్టాలని అక్కినేని అభిమానులు అభ్యర్థన చేస్తున్నారు. ANR తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన కళారంగానికి ఎంతో సేవ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమని మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తీసుకురావడంలో కీలక పాత్రపోషించారు. ఆయన చేసిన కృషికి గాను ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలనీ.. ప్రభుత్వాన్ని అక్కినేని అభిమానులు కోరుతున్నారు. అక్కినేని నాగేశ్వరావు గారు కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వెంకట రాఘవాపురం గ్రామానికి చెందిన అక్కినేని పున్నమ్మ, వెంకటరత్నం దంపతులకు జన్మించారు.
ఇక కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను, విశాఖపట్నం జిల్లాలోని పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా, నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అలానే జిల్లాల పునర్విభజనలో భాగంగా తిరుపతి కేంద్రంగా ఏర్పడనున్న జిల్లాకు శ్రీ బాలాజీ, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కినేని పేరు తెరమీదకు వచ్చింది. మరి మచిలీపట్నం జిల్లాకు అక్కినేని నాగేశ్వరావు గారి పేరు పెట్టాలనే అక్కినేని అభిమానుల అభ్యర్థన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.