ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కొంతకాలంగా వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి సత్తా చాటి ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని అధికార పక్షం భావిస్తుంది. మరోవైపు ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో అధికార దక్కించుకునేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. అధికార పక్షం వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని టీడీపీ గట్టి పట్టుమీదనే ఉంది. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ త్వరలో పాదయాత్ర కు సిద్దమవుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాద యాత్ర ప్రారంభమై.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం లో ముగియనుంది. నారా లోకేష్ ఏడాది మొత్తం ప్రజల్లో ఉంటూ వారి కష్ట సుఖాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయనున్నట్లు పార్టీ శ్రేణులు అంటున్నారు.
ఏపిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. వారి కష్ట సుఖాల గురించి తెలుసుకొని తమను గెలిపిస్తే అన్ని కష్టాలు తీరేలా చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉండవల్లి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నారా లోకేష్ అక్కడ ఉన్న ప్రజలకు చేతులు జోడించి తనను క్షమించాలని కోరారు.. దాంతో కొంతమంది ఎంతో ఎమోషన్ కి గురయ్యారు. ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారిపోయింది.
నారా లోకేష్ అక్కడి ప్రజలను ఎందుకు క్షమాపణలు కోరారు అన్న విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలో ఉన్నపుడు సీతానగర్ ఘాట్ వద్ద కొంత మంది నివాసం ఉండేవారు.. అక్కడ నుంచి నివాసాలు తొలగించి ఉండవల్లి దగ్గర స్థలాలు ఇచ్చారు. ఆ సమయంలో వసతులతో కూడిన చక్కటి ఇళ్లు నిర్మించి ఇస్తామని టీడీపీ నేతలు చెప్పారు. కానీ అది కుదరకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం నారా లోకేష్ అక్కడ పర్యటనకు రావడంతో తమ బాధను చెప్పుకున్నారు. వారి పరిస్థితి చూసి చలించిపోయిన నారా లోకేష్ ‘తమ పార్టీ అధికారం ఉన్నపుడు అన్ని వసతులు కల్పించి ఇళ్లు కట్టించి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదని.. ఈ పరిస్థితి కారణం అయిన తమను ప్రజలు మనస్ఫూర్తిగా క్షమించాలని’ కోరారు. వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుంది.. అప్పుడు అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్.