గత కొన్ని రోజులుగా ఏపిలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు పై పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. ఈ నేపథ్యంలో సినీ పెద్దలు ఏపి ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిపారు. ఇప్పటికే సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని.. టికెట్ల రేట్లు తగ్గిస్తే నష్టాల్లో కూరుకు పోతామని సినీ పెద్దలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణరావు, దుర్గాప్రసాద్ వాదనలను వినిపించారు. ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు తగ్గిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 35 ని ఏపి హై కోర్టు రద్దు చేసింది. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించే వెసులుబాటు పిటిషన్లరకు ఉందని స్పష్టం చేసింది.
కొత్త సినిమాలు వచ్చినపుడు రేట్లు పెంచుకునే హక్కు థియేటర్లకు ఉంటుందని పిటీషన్లు వాధించారు. వీరి వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది. రేట్లు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఏపి హైకోర్టు సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు జీవోని రద్దు చేసింది.