ఆంధ్రప్రదేశ్ టీడీపీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ మద్యనే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కన్నుమూసిన విషయం మరువకముందే.. మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు కన్నుమూయడంత తీవ్ర విషాదం నెలకొంది. గతకొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. టీడీపీ హయాంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ఆయన పనిచేశారు. మాజీమంత్రి, టీడీపీ నాయకుడు గారపాటి సాంబశివరావు మృతి బాధాకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
ఇది చదవండి : ప్రభుత్వంపై ఇక సమరమే.. తేల్చి చెప్పిన ఉద్యోగ సంఘాలు
ఒక నాయకుడిగా పార్టీకి, ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన పనితీరు, ప్రజా సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్దికి నిదర్శనంగానే దెందులూరు ప్రజలు 4 సార్లు ఎమ్మెల్యేగా ఆదరించారు. సాంబశివరావు మృతిపట్ల దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సంతాపం తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. సాంబశివరావు మృతి పట్లు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.