ఏపీ, తెలంగాణాల్లో ఇటీవల జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఆకస్మాత్తుగా జరుగుతున్న ఈ ప్రమాదాల్లో ఒక్కో సారి ప్రాణ నష్టం తప్పినా, ఆస్తి నష్టం వాటిల్లుతుంది. తాజాగా కాకినాడలో ఓ స్కూటీ అనుమానాస్పద రీతిలో తగుల బడిపోయింది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో జరుగుతున్న పలు అగ్ని ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కొన్ని సార్లు ఈ ఘటనల్లో ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ.. కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కాకినాడ జిల్లాలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఓ స్కూటీకి అకస్మాత్తుగా నిప్పంటుకుంది. ఈ ఘటన సామర్లకోట పట్టణం బళ్ల మార్కెట్ సమీపంలోని భీమవరంపేటలో చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ స్కూటీ దగ్ధమైంది. విధులు ముగించుకుని వచ్చిన తర్వాత, రాత్రి పార్క్ చేసిన స్కూటీ, ఆకస్మాత్తుగా నిప్పంటుకుని తగలపడిపోవడంతో బాధితుడు దూలపల్లి రాజు ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటనలో కొంత డబ్బు కూడా బుగ్గిపాలు అయింది. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సోమవారం పని నిమిత్తం బయటకు వెళ్లిన తాను, పలు చోట్ల అదే స్కూటీపై తిరిగానన్నారు. ఆ రాత్రి ఇంటికి వచ్చి స్కూటీ పార్క్ చేసి ఉంచానని, అర్థరాత్రి సమయంలో పక్కింటి వ్యక్తి బండి కాలిపోతుందంటూ తనకు సమాచారం అందించాడన్నారు. అయితే ఇంట్లో నుండి వచ్చే చూసే సరికి స్కూటీ కాలిపోయింది. తనకు బండి కాలిపోయిందన్న బాధ కన్నా.. తన యజమానికి ఇవ్వాల్సిన డబ్బు కాలిపోవడంపై ఆవేదన చెందారు. ఆ డిక్కీలో రూ. 50 వేలు ఉంచానని.. ఆ డబ్బంతా ఇప్పుడు అగ్నికి ఆహుతి అయ్యిందన్నారు. అంత డబ్బు కాలిపోయే సరికి రాజుకు ఏం పాలుపోలేదు. తమకు ఎవరి మీద అనుమానం లేదన్న ఆయన.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.