చిన్న పిల్లల నుండి కాటికి కాళ్లు చాపే ముదసలి వరకు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడదైతే చాలు, వారిపై తమ కోరికలను తీర్చుకుంటున్నారు కామాంధులు. కాదంటున్న వారిపై కక్ష పెంచుకుని వారిపై అమానుషాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో మరో మహిళ కామాంధులకు బలైపోయింది.
శారీరకంగా,మానసికంగా ఆడవాళ్లపై హింస కొనసాగుతూనే ఉంది. ప్రేమ, పెళ్లి, కామం, డబ్బు ఇవే కారణాలుగా వారిపై దాడులు జరుగుతున్నాయి. సామాన్యుల నుండి సెలబ్రిటీ మహిళలు, అమ్మాయిల వరకూ ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నవారే. వారి పట్ల పురుషులు అమానుషత్వ ధోరణిలో వ్యవహరిస్తున్నారు. వారి కోరికలను తీర్చకపోయినా, వారిని కాదంటున్నామహిళల పట్ల కక్షపూరితంగా వ్యవరిస్తున్నారు. వారి జీవితాలను అంతం చేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వారి కోరిక తీర్చలేకపోగా, పెద్దలకు చెప్పిందన్న కారణంగా ఓ మహిళపై హత్యాచారానికి ఒడిగట్టారు కామాంధులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం పరిధిలో గత నెల 24న గడ్డి వామిలో కాలిపోయిన స్థితిలో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. మహిళగా గుర్తించిన పోలీసులు సమీప గ్రామాల్లో ఆరా తీశారు. అయితే తమ కుమార్తె సత్యవేణి కనిపించడం లేదంటూ మాచవరం దేవుడు మన్యం కాలనీకి చెందిన ద్వారంపూడి గంగరాజు పోలీసులకు తెలిపాడు. ఆమెకు మానసిక స్థితి సరిగా లేదని చెప్పాడు. అయితే పోలీసులు విచారణలో అదే కాలనీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు నల్లమిల్లి ఉమామహేశ్వర రెడ్డి, వెంకట సత్యనారాయణ రెడ్డి కనిపించడం లేదంటూ పోలీసులకు సమాచారం అందింది. అయితే వారిద్దరూ గతంలో సత్యవేణిని వేధించగా.. ఆమె పెద్దలకు చెప్పింది. ఈ విషయం స్థానిక పెద్దల వరకు చేరగా.. వీరిద్దరినీ మందలించారు.
అయితే సత్యవేణిపై కక్ష పెంచుకున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు గత నెల 23న రాత్రి ఇంటికి వస్తున్న ఆమెను అడ్డగించారు. అనంతరం ఆమె నోరు నొక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే ఉన్న గడ్డివామిలో వేసి తగుల బెట్టారు. అయితే సత్యవేణిపై హత్యాచారానికి ఒడిగట్టిందీ తన కుమారులేనని తెలిసిన తల్లి నల్లమిల్లి పద్మ మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లి చనిపోయిన విషయం తెలిసిన కుమారులు.. ఆమె మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన సమయంలో పోలీసులు అరెస్టు చేసినట్లు రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి శుక్రవారం విలేకరులకు వెల్లడించారు.